తెలుగు మీడియాలో హఠాత్తుగా మరోసారి జీఎన్ రావు, బోస్టన్ కమిటీ రిపోర్టులు హైలెటయ్యాయి. రెండు అగ్రదినపత్రికల్లోనూ.. ఈ నివేదికల సారాంశం బయటకు వచ్చింది. విశాఖకు తుపాన్ల ముప్పు ఉందని..అది సున్నితమైన ప్రాంతం అని.. అక్కడ రాజధాని పెట్టి.. ఒత్తిడి పెంచాల్సిన అవసరం లేదని.. రిపోర్టుల్లో చెప్పినట్లుగా పత్రికలు ప్రచురించాయి. దీంతో.. ఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే.. జీఎన్ రావు, బోస్టన్ కమిటీలు.. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయాలని ప్రతిపాదించాయని ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు వికేంద్రీకరణ బిల్లు తీసుకు వచ్చింది. ప్రస్తుతం ఈ బిల్లు శాసనమండలిలో ఉంది.
రిపోర్టులన్నింటినీ ఇప్పటికీ సీక్రెట్‌గా ఉంచేసిన సర్కార్..!
అసలు జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ రిపోర్టులను ప్రభుత్వం బయట పెట్టలేదు. ఆయా కమిటీలు రిపోర్టులు సమర్పించినప్పుడు.. అందులో ఉన్న వివరాలు.. సంక్షిప్తంగా.. వివరించారు. జీఎన్ రావు కమిటీ అయితే.. తమ కమిటీ అభిప్రాయాలు మీడియా ముందు చెప్పి.. అనేక సందేహాలు లేవనెత్తారు. ఇక బోస్టన్ కమిటీ అయితే.. మీడియా ముందుకే రాలేదు. ఆ కమిటీ అభిప్రాయాలంటూ.. కొన్ని సిఫార్సులను ఓ ఉన్నతాధికారి మీడియాకు వివరించారు. ఆ తర్వాత ఆ రిపోర్టులపై కేబినెట్లో చర్చ జరిగిందని చెప్పారు కానీ.. బయటకు విడుదల చేయలేదు. ఆ రిపోర్టులను పరిశీలించడానికి హైపవర్ కమిటీని నియమించారు. ఆ కమిటీ రిపోర్ట్ కూడా బయటకు రాలేదు. అన్నీ గుప్తంగా ఉంచేసిన ప్రభుత్వం.. వాటిని చూపించి నిర్ణయాలను మాత్రం శరవేగంగా తీసుకుంది.
ఇప్పుడు విశాఖకు వ్యతిరేకంగా ఉన్న అంశాలు ఎలా లీకయ్యాయి..?
అయితే.. మండలిలో బిల్లు ఇరుక్కుపోయాక.. అనూహ్యంగా.. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ రిపోర్టుల్లో.. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానికి అనుకూలంగా కాదని నివేదికలు ఇచ్చాయన్న విషయం లీక్ అయింది. విశాఖకు తుపాన్ల ముప్పు ఉందని.. వాతావరణ పరంగా.. రాజధానికిఅంత అనుకూలం కాదని.. హుదూద్ తుపాన్ల వంటివి వస్తాయని చెప్పినట్లుగా తెలుగు మీడియా చెబుతోంది. ఈ విషయాలను ప్రభుత్వం బయట పెట్టలేదు. కానీ ఇప్పుడు బయటకు వచ్చాయి. ఎలా వచ్చాయన్నది మాత్రం.. చాలా మందికి అర్థం కావడం లేదు. ప్రభుత్వంలోని వర్గాలు లీక్ చేయకపోతే.. చిన్న విషయం కూడా బయటకు రాలేదు. కావాలనే సర్కార్.. ఈ విషయాలను లీక్ చేసిందంటున్నారు.