గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇప్పటికే వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాటి మాట ఎలా ఉన్నా సెక్స్ పై కూడా గ్లోబల్ వార్మింగ్ ప్రభావం పడుతున్నదన్న వార్త ఆందోళన కలిగిస్తోంది.
మనదేశంలో శీతాకాలం వచ్చిందన్నమాటేగానీ, ఇంకా మండేఎండల్నే ఎదుర్కుంటున్నాం. అదేమంటే వాతావరణంలో మార్పులే కారణమంటున్నారు. కర్బన ఉద్గారాల (carbon emissions) శాతం పెరిగిపోవడం, ఓజోన్ పొర పలచనైపోవడం వంటి కారణాలవల్ల ప్రపంచమంతటా ఎండలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. శీతలదేశాలు కూడా ఈ గండం నుంచి తప్పించుకోలేవు.
వాతావరణ మార్పు ప్రభావం సుఖసంసారంమీద కూడా పడుతోంది. అనూహ్యమైన వాతావరణ మార్పుల వల్ల ఎండలు బాగా పెరుగుతుండటంతో సెక్స్ కోరిక మందగిస్తోంది. అంటే వాతావరణ మార్పులే గర్భనిరోధక శక్తిగా మారుతోందన్నమాట. శారీరకంగా కలవాలన్న కోరిక తగ్గడంతో సెక్స్ లో పాల్గొనే ఫ్రీక్వెన్సీ కూడా గణనీయంగా కుచించుకుపోతుంది.
అమెరికాలోని ఎకనమిక్ రీసెర్చ్ బ్యూరో ఈ మధ్య నిర్వహించిన సర్వేలో ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. బాగా ఎండకాస్తున్న రోజున సెక్స్ కోరికలు చప్పబడుతున్నాయని, తదనుగుణంగానే ఆ రోజునుంచి 9 నెలలు లెక్కకట్టి చూస్తే ప్రసవాల శాతం తగ్గడాన్ని గమనించారు. గత 80ఏళ్లు లెక్కలు తీసుకుంటే పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉండటం గమనార్హం.
సెక్స్ లో పాల్గొనాలన్న కోరిక- సంతాన సాఫల్యం – ఈరెంటికీ మధ్య చక్కటి అనుబంధం ఉంది. ఈ రెంటిలో మొదటిదైన సెక్స్ లో పాల్గొనడమన్నది అనేక కారణాలపై ఆధారపడిఉంటుంది. ఆ కారణాలే దేశ జనాభా పెరుగుదలపై కూడా పడుతుంటాయి. ఈ కారణాలలో ఆర్థిక, సామాజిక కారణాలు కూడా ఉన్నాయి. వీటి తీవ్రత ఒక దేశానికి మరో దేశానికి భిన్నంగా ఉండవచ్చు. ఉదాహరణకు నిన్నమొన్నటి దాకా ఒక సంతానం చాలన్న చైనా తన పాలసీని మార్చుకుని ఇద్దరు పిల్లలను కనవచ్చని చెప్పడం ఇలాంటిదే. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ, ఇప్పుడు తాజాగా తెలిసిన విషయం గ్లోబల్ వార్మింగ్ కీ సంతాన సాఫల్యతకీ మధ్య సంబంధం ఉండటం. వచ్చే 50ఏళ్లలో వాతావరణ ప్రభావం సెక్స్ కోరికల హెచ్చుతగ్గులపై పడుతుందట. ఈ సర్వే గ్లోబల్ వార్మింగ్ అని నేరుగా చెప్పకపోయినా వాతావరణంలోని మార్పులతో సెక్స్ కోరికకు సంబంధం ఉన్నదని మాత్రం చెప్పింది. బెడ్ రూముల్లో ఎసీలు గట్రా పెట్టుకోవడం వంటివి తాత్కాలిక పరిష్కారమేగానీ, శాశ్వతపరిష్కారం కానేకాదు.
మొత్తానికి వాతావరణ మార్పు చివరకు మానవాళి సంతానోత్పత్తి శక్తినే దెబ్బతీయబోతుందని అర్థమవుతుంది. మరి అలాంటప్పుడు ప్రపంచ జనాభా తగ్గబోతుందని సంతోషించాలా, లేక మానవజాతి వినాశనానికి మానవ తప్పిదమైన గ్లోబల్ వార్మింగే ప్రధాన భూమిక పోషించబోతున్నందుకు సిగ్గుతో తలదించుకోవాలో తెలియని పరిస్థితి ఇది. మరి దీని పరిణామం ఎలా ఉండబోతుందో … ?ఏమో…??