తెలంగాణా ప్రభుత్వం హైదరాబాద్ జంట నగరాలలో శిధిలావస్థకు చేరుకొంటున్న చారిత్రిక కట్టడాలను కూల్చి వేసేందుకు వీలుగా చట్ట సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తాజా సమాచారం. ఉస్మానియా ఆసుపత్రిని కూల్చివేసి దాని స్థానంలో అత్యాధునిక ఆసుపత్రిని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఎర్రగడ్డ ఆసుపత్రిని, దానిపక్కనే ఉన్న ఒక పురాతన చారిత్రిక కట్టడాన్ని కూల్చివేసి, అక్కడ బహుళ అంతస్తులతో నూతన సచివాలయం నిర్మించాలని భావిస్తోంది. మెట్రో రైల్ మార్గంలో అడ్డుగా ఉన్న కొన్ని పురాతన భవనాలను కూడా తొలగించవలసి ఉంది.
ఈ చట్ట సవరణ ద్వారా వాటిని కూల్చివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఏర్పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించింది. అది నగరంలో పురాతన భవనాలను అధ్యయనం చేసి నివేదిక అందించిన తరువాత దానిని బట్టి తెలంగాణా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొంటుంది. ఇదివరకు ఉస్మానియా ఆసుపత్రిని కూల్చాలనుకొన్నప్పుడు ప్రతిపక్షాల నుండి తీవ్ర నిరసన ఎదురవడంతో ఆ ఆలోచనను విరమించుకొంది. కానీ మళ్ళీ ఉత్తర్వులు జారీ చేయడం గమనిస్తే ఆ ఆలోచనను పూర్తిగా విరమించుకాలేదని స్పష్టం అవుతోంది. బహుశః మళ్ళీ ప్రతిపక్షాలు ప్రభుత్వంతో యుద్దానికి సన్నధం కావాలేమో?