రాజధాని రైతులు కౌలు కోసమే ఆందోళన చేస్తున్నారని చెప్పిన పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ మాటలను..ఏపీ సర్కార్ నిజం చేసింది. రాజధాని రైతుల కౌలు బకాయిలు.. రూ.187.40 కోట్లను విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ఈ మొత్తాన్ని రైతులకు చెల్లించేందుకు.. సీఆర్డీఏ, మునిసిపల్ శాఖ ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చినందుకు ఏపీ సీఆర్డీఏ ప్రతి ఏడాది కౌలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రాజధాని పరిధిలోని 29గ్రామాల్లో 33వేల ఎకరాలను 27 వేల మంది రైతులు అమరావతి నిర్మాణానికి ఇచ్చారు. పదేళ్ల పాటు మెట్టభూమికి ఎకరానికి రూ.30వేలు, జరీబు భూములకు రూ.50వేల చొప్పున ప్రభుత్వం కౌలు చెల్లిస్తోంది.
ప్రతి సంవత్సరం 10శాతం పెంచుతూ పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఏడాది జూన్ నెలలో కౌలు నగదు చెల్లిస్తున్నారు. 2019-20 సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆగస్టు వచ్చినా.. కౌలు అందకపోవడం… రాజధానిపై భిన్నమైన ప్రకటనలు చేస్తూండటంతో.. రైతులు ఆందోళనకు గురయ్యారు. అయితే..రైతుల ఆందోళనను వీలైనంతగా తగ్గించడానికి కౌలు బకాయిల్ని ప్రభుత్వం విడుదల చేస్తూ జీవో జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మామూలుగా రైతులకు ఈ బకాయిలు అందించడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాల్సిన పని లేదు. నేరుగా బ్యాంక్ అకౌంట్లలో ప్రతీ ఏటా పడుతుంది. కానీ ఈ సారి మాత్రం మరో విభిన్నమైన ప్రక్రియ ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది.
కౌలు విషయాన్ని రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టే.. విడుదల చేశామని.. జీవో విడుదల తర్వాత మంత్రి బొత్స ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించుకున్నారు. రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాజధానిపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ప్రకటించారు. కరకట్టపై ఇల్లు మునుగుతుందని తెలిసే… చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ వెళ్లిపోయారని బొత్స ఆరోపించారు. మొత్తానికి రాజాధాని రైతుల విషయంలో.. ఇప్పటికి కౌలు జీవో రిలీజ్ చేసిన సర్కార్… అసలు రాజధానిపై ఏం నిర్ణయం తీసుకోబోతోందో మాత్రం త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.