నిజంగా ఇది నిజం. ఒక మేక అరెస్టయింది. బెయిలుమీద విడుదలైంది. ఛత్తీస్ గఢ్ లో జరిగిందీ ఘటన. ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ కు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరీ పట్టణంలో ఓ మేక అరెస్టయింది. జిల్లా మేజిస్ట్రేట్ బంగళా ఆవరణలోకి ప్రవేశించడం అది చేసిన నేరం. ఇనుక గేటు పైనుంచి దూకి సదరు మేక బంగళా ఆవరణలోకి ప్రవేశించింది. వాచ్ మెన్ ఫిర్యాదుతో పోలీసులు మేకను అరెస్టు చేశారు. దాని యజమానిని కూడా అరెస్టు చేశారు.
మేక యజమానిపై తీవ్రమైన అభియోగాలను నమోదు చేశారు. అవి రుజువైతే రెండు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష, జరినామానా విధించే అవకాశం ఉంది. ఉన్నతాధికారి బంగళా అని తెలియక పాపం ఆ మూగజీవి లోపలికి వెళ్లింది. సువిశాలమైన బంగళా ఆవరణలో రకరకాల చెట్లున్నాయి. కాస్త సుష్టుగా ఆకులను భోంచేద్దామని అనుకుందో మరేంటో గానీ గేటు దూకి లోపలికి వెళ్లింది.
అక్కడి వాచ్ మెన్ వివరణ మరోలా ఉంది. గతంలో చాలా సార్లు ఆ మేక లోపలికి వచ్చిందట. దాని యజమానికి అనేక సార్లు హెచ్చరించాడట. అయినా పట్టించుకోకపోవడంతో ఈసారి సీరియస్ గా తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందంటున్నాడు. పోలీసులు కూడా ఈ కేసును సీరియస్ గానే తీసుకున్నారు. అత్యంత కఠినమైన సెక్షన్ల కింద్ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. ఏదో బక్క ప్రాణిని, ఇంతటి కఠినమైన చర్యలు వద్దంటూ మేక యజమాని వేడుకుంటున్నాడు. చివరకు ఆ ఉన్నతాధికారి కనికరించి వదిలేస్తారా లేక కఠిన శిక్ష పడేదాకా సీరియస్ గా తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.
జంతువుల కారణంగా వాటి యజమానులు ఇబ్బంది పడటం గతంలోనూ వివిధ ప్రదేశాల్లో జరిగింది. అయితే ఇన్నేళ్ల జైలు శిక్ష పడే సెక్షన్ల కింద కేసు నమోదు కావడం మాత్రం అరుదు. ఈ అరుదైన సంఘటన ఛత్తీస్ గఢ్ లో జరిగింది.