రెండోపంట దాళ్వా/రబీ లో గోదావరి డెల్టాల్లో ఆరున్నర లక్షల ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వగలమని జలవనరుల శాఖ తేల్చి చెప్పేసింది. మొత్తం పదిలక్షల ఎకరాలకూ నీరు ఇవ్వవలసిందేనని రైతు ప్రతినిధులు సభ్యులుగా వున్న ధవిళేశ్వరం ప్రాజెక్టు కమిటీ పట్టు బడుతోంది.
దేశానికే ధాన్యాగారంగా పేరున్న గోదావరి జిల్లాలను ధాన్యం ఉత్పాదకతలో నల్గొండ, కరీంనగర్ జిల్లాలు అధిగమించాయి. ఆజిల్లారైతులతో పోలిస్తే గోదావరి జిల్లాల రైతులు ఆధునిక, శాస్త్రీయ సాగుపద్ధతులను అనుసరించకపోవటమే ఇందుకు మూలం. మరోవైపు గోదావరి జలాల పారుదల క్షీణించిపోతూండటం వల్ల రబీలో పంట తయారవ్వకపోవడం, వర్షాలే ప్రధాన ఆదారమైన సార్వా/ఖరీఫ్ బాగా పండినా తుపానులు భారీ వర్షాల వల్ల మునిగిపోవడం, తెగుళ్ళపాలవ్వడం గోదావరి డెల్టాల్లో కొన్ని దశాబ్దాలుగా పెరుగుతున్న సమస్య.
అయినా కూడా తూర్పుగోదావరి జిల్లాలోని 3 లక్షల ఎకరాల గోదావరి తూర్పు డెల్టా, 2 లక్షల ఎకరాల సెంట్రల్ (కోనసీమ)డెల్టా, పశ్చిమగోదావరి జిల్లాలోని 5 లక్షల ఎకరాల వెస్ట్రన్ డెల్టాల్లో నీరు ఎక్కువై ఒకసారి నీరు చాలక ఒకసారి పోయింది పోగా దక్కిన ధాన్యమే ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్ధలో ఏటా ఏడు వేల కొట్లరూపాయల నుంచి పదివేలకోట్ల కోట్లరూపాయల వరకూ డబ్బుని ప్రవహింపజేసే శక్తివంతమైన వనరుగా వుంది. గోదావరి నీటితో పండిన బియ్యం రుచి మరే బియ్యానికీ లేదని దేశంలో ఎక్కడున్నా ఈ డెల్టాల బియ్యాన్నే తెప్పించకుని వండుకు తినే అలవాటు తరం నుంచి మరోతరానికి పరంపరగా వ్యాపిస్తోంది.
రబీ సాగుకి ఈ మూడు డెల్టాలూ సీలేరు రిజర్వాయిర్ నుంచి గోదావరిలోకి విడుదల చేసే నీటి మీదే ఆధారపడవలసిన పరిస్ధితి ఏటేటా విస్తరిస్తోంది. పూర్తి వర్షాభావం వల్ల సీలేరులో కూడా నీరు లేక 2002, 2009 సంవత్సరాల్లో సగానికంటే ఎక్కువ వరి చేలు ఎండిపోయాయి. ” ఇపుడు ఇన్ ఫ్లో సెకెనుకి 20
వేల ఘనపు అడుగులు కూడా లేదు. ఇది 60 వేల టిఎంసిలు కూడా వుండదు.(ఒక టిఎంసి అంటే వందకోట్ల ఘనపు అడుగులు) ఇది 2002 సంవత్సరం కంటే గడ్డు స్ధితి” అని జలవనరులశాఖ ధవళేశ్వరం సర్కిల్ ఎస్ఇ సుగుణాకరరావు చెప్పారు.
గోదావరి పుష్కరాలలో లక్షలాదిమంది యాత్రీకుల పుణ్య స్నానాలకోసం ఘాట్లను నింపి వుంచడానికి సీలేరులో రబీకోసం వుంచిన నీటి నిల్వలను ముందుగానే విడుదల చేయవలసిరావడమే ఈ స్ధితికి మూలమని రైతులకు కూడా తెలుసు.
అయితే గోదావరి ప్రవాహాలు మందగించిన సంవత్సరాల్లో తక్కువ నీరివ్వడం, వంతులవారీగా నీరిచ్చే ”వారబంది” ని అమలుచేయడం వంటి వాటర్ మేనేజిమెంటు చర్యల ద్వారా మొత్తం 10 లక్షల ఎకరాల మూడు డెల్టాలకీ నీరివ్వవలసిందే అని ధవిళేశ్వరం ప్రాజెక్టు కమిటీ చైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజు అంటున్నారు. “గతంలో ఒక టిఎంసి నీటితో 8600 ఎకరాలను పండించే వారు. ఒక టిఎంసి నీటితో 10,830 ఎకరాలను పండించిన అనుభవం కూడా ఈ డెల్టాల్లోనే వుంది. తక్కువ నీటితో నాణ్యమైన దిగుబడిని సాధించిన అనుభవం కూడా గోదావరి డెల్టా రైతుదే” అని ఆయన ఉదాహరించారు.
ఈసారి ఒక టిఎంసి నీటితో 11వేల ఎకరాల నుండి 12వేల ఎకరాల్లో రబీని పండించే విధంగా రైతులను చైతన్యపరచాలని, రైతులు, జలవనరులశాఖ అధికారులు, ప్రాజెక్టు కమిటీ సభ్యులు కలిసి కష్టపడాలని ప్రాజెక్టు కమిటీ నిర్ణయించింది. తక్కువ నీటితో నాణ్యమైన అధిక దిగుబడిని సాధించటం ద్వారా చరిత్రను తిరగరాయాలన్న పట్టుదలను ప్రాజెక్టు కమిటీ కనబరుస్తోంది.ఈ ఉత్సాహం చూసి జలవనరుల శాఖ అధికారులు కూడా కొత లేకుండా డెల్టాలన్నిటికీ నీరు సర్దుబాటు చేద్దం అంటున్నారు.