హైదరాబాద్: గోదావరి జలాలు హైదరాబాద్ నగరంవైపుకు వడివడిగా పరుగులు తీస్తున్నాయి. మరో ఐదు రోజులలో నగరాన్ని చేరుకుంటాయి. దీనితో హైదరాబాద్, సికింద్రాబాద్, గ్రేటర్ హైదరాబాద్ సర్కిల్స్‌లోని ప్రజల దాహార్తి తీరనుంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌తోపాటు సింగూరు, మంజీరా జలాశయాలు వట్టిపోయిన నేపథ్యంలో గోదావరి జలాలు నగరవాసుల దాహార్తిని తీరుస్తాయని భావిస్తున్నారు.
మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ సుజల స్రవంతి పేరుతో నిర్మిస్తున్న గోదావరి మంచినీటి పథకం మొదటి దశలో నగరానికి 172 ఎంజీడీల గోదావరి నీరు తరలించనున్నారు. అయితే మొదట 85 ఎంజీడీ(మిలియన్ గ్యాలన్స్ పర్ డే)ల నీటిని నగరానికి, నగర శివార్లలోని కు కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఆల్వాల్, పటాన్ చెరువు ప్రాంతాలకు సరఫరా చేయాలని వాటర్ బోర్డ్ అధికారులు నిర్ణయించారు. పైప్ లైన్ల నిర్మాణం, సర్వీస్ రిజర్వాయర్ల నిర్మాణం, ఇతర పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ మొదటి దశ పనులను వాస్తవానికి డిసెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, 15 రోజులు ముందుగానే పూర్తి చేయాలనే సంకల్పంతో వాటర్ బోర్డ్ అధికారులు రాత్రింబవళ్ళు పనిచేస్తున్నారు. గోదావరి జలాలు గతవారానికి కరీంనగర్ జిల్లాలోని ముర్మూర్ వద్ద నిర్మించిన ఇన్‌టేక్ వాల్ నుంచి 125 కిలో మీటర్లు ప్రయాణించి కొండపాక చేరుకున్నాయి. నిన్నటికి సిటీకి 30 కిలోమీటర్ల దూరంలోని ఘన్పూర్ వచ్చేశాయి. అక్కడ శుద్ధిచేయబడే జలాలు షామీర్ పేట రిజర్వాయర్‌కు చేరుకుని అక్కడనుంచి నగరంలోకి సరఫరా చేయబడతాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఘన్‌పూర్‌లో ఈ ప్రాజెక్ట్ కోసం నిర్మించిన 150 ఎంఎల్(మెగా లీటర్) సామర్థ్యంతో నిర్మించిన మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దేశంలోనే అతి పెద్ద రిజర్వాయర్ అని వెల్లడించారు. దీనికి 50 ఎకరాల అటవీభూమిని కేటాయించటంలో అటవీశాఖ చేసిన ఆలస్యం లేకపోతే ప్రాజెక్ట్ ఇంకా ముందు పూర్తయ్యేదని అంటున్నారు.