ఏమిటో, గోదావరి పుష్కరాలు చూస్తుండగానే వెళ్ళిపోయాయి. దీంతో రాజమండ్రి సహా అనేక చోట్ల వేలాది స్నాన ఘట్టాలు తెల్లారేసరికి బోసిపోతున్నాయి. నిన్నటిదాకా లక్షలాది యాత్రికులతో కళకళలాడుతూ సందడిగా ఉన్న నదీతీరం మరోసారి మౌనముద్రవహించింది. పుష్కరాలు అయిపోయాయని అధికారికంగా ప్రకటించగానే ఏదో తెలియని దిగులు ఆవహించింది.
అయితే, తల్లి గోదారి మాత్రం `ఎందుకురా, అంతగా దిగులుపడిపోతారు. పుష్కరుడు ఈ ఏడాది అంతా నాదగ్గరే ఉంటాడు. ప్రతి రోజు మధ్యాహ్నంవేళ పుష్కరునికి ఇష్టమైన వేళ హాయిగా వచ్చి స్నానంచేసి పూజాదికాలు పూర్తిచేసుకోండి. లేదంటే చివరి 12 రోజులు ఉండనే ఉన్నాయిగా, ఈ అంత్య పుష్కరాల్లో పుణ్యస్నానాలు చేయండి ‘ అని అంటున్నట్టుంది.
`కానీ, సందడి, హుషారు, పండుగ వాతావరణం లేకుండా చప్పచప్పగా, ఒంటికొమ్ములాగా వెళ్ళి ఏం స్నానం చేస్తాం సారూ… అందులో మజా ఏముంటుంది చెప్పండి’ అనేవాళ్లూ ఉన్నారు. అలాంటివాళ్లకు ఇంకా అవకాశం ఉంది. అదేలా ! పుష్కరం పూర్తయిన తర్వాత మళ్ళీ అంత రద్దీగా, పండుగ వాతావరణంలో స్నానాలు, ఆ హడావుడీ ఎందుకుంటుంది? అదేలా సాధ్యం ? అని మీరు అడగొచ్చు.
గోదావరికి మరో పండుగ
గోదావరి మహా పుష్కరాలు పూర్తయినా, గోదావరి నదికే మరో అద్భుతమైన పండుగ జరగబోతోంది. గోదావరికి పుష్కరాల పర్వం జులై 25తో పూర్తికాగా, మరో అద్భుతమైన పండుగ గోదావరినదీతీరంలోనే ఆగస్టు 12న ప్రారంభమవుతుంది. ఇది పుష్కరాల్లాగా 12 రోజులకే పూర్తికాదు! సెప్టెంబర్ 25వరకూ అంటే, 45 రోజులపాటు జరిగే ఈ పవిత్ర పుణ్యస్నాన ఘట్టాన్ని `గోదావరి కుంభమేళా’ అంటారు. అయితే, ఈ కుంభమేళాను ప్రతిచోటా చేయరు. కేవలం మహారాష్ట్రలోని నాసిక్ వద్దనే జరుగుతుంది. నాసిక్ అన్నది గోదావరి నది జన్మక్షేత్రం. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 25 మధ్యకాలంలో శ్రావణ పూర్ణిమ (ఆగస్టు 29), శ్రావణ అమావాస్య (సెప్టెంబర్ 13) , రుషి పంచమి (సెప్టంబర్ 18), వామన జయంతి (సెప్టెంబర్ 25) అత్యంత ప్రవిత్రమైన రోజుల్లో స్నానం మరింత శ్రేష్టమని అంటున్నారు.
బంపర్ ఆఫర్
144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా పుష్కరాల కీలక పర్వదినాలు (12 రోజులు) పూర్తయ్యాయనీ, ఇంకా తాము పుణ్యస్నానం చేయలేదని ఎవరైనా దిగులుపడుతుంటే, వారికి నాసిక్ కుంభమేళా చక్కటి ఊరట కలిగిస్తుంది. పైగా, మరో విశేషమేమంటే, అనేక పుష్కరాల్లో చేసిన స్నానఫలం ఈ ఒక్క కుంభమేళాలో చేసిన స్నానం అందిస్తుందట. కాబట్టి ఇదో బంపర్ ఆఫర్. పుష్కర స్నానం చేసినవాళ్లు కూడా ఈ ఆఫర్ ను వదులుకోకూడదని పండితులు చెబ్తున్నారు. మరో సౌకర్యమేమంటే, కుంభమేళా 55రోజులు సాగుతుండటంతో వీలుచూసుకుని సెప్టెంబర్ 25దాకా ఎప్పుడైనా వెళ్లొచ్చు. తీరుబడిగా స్నానాదికాలు పూర్తిచేసుకోవచ్చు.
తేడా ఏమిటి ?
పుష్కరం ఎలా వస్తుందో మనలో చాలామందికి ఇప్పటికే అవగాహనకు వచ్చేఉంటుంది. బృహస్పతి (గురుడు) ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రత్యేకించి ఒక్కోనదికి పుష్కరాలు వస్తాయని తెలుసుకున్నాం. అయితే, కుంభమేళా అనేది రాశులతో సంబంధం లేకుండా సూర్యుడు, బృహస్పతి (గురుడు) సంచారం ఆధారంగా వస్తుంటుంది. మరో విశేషమేమంటే కుంభమేళాలు అన్ని చోట్లా జరగవు. హరిద్వార్, ప్రయాగ, ఉజ్జయిని, నాసిక్ లలో మాత్రమే ఆయా నదుల్లో జరుగుతుంటాయి. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలోకి రాగానే నాసిక్ లో గోదావరి కుంభమేళా ప్రారంభమైందని పండితులు చెబుతున్నారు. ఇది సింహస్థపూర్ణ కుంభమేళాగా పిలుస్తున్నారు. ఇలాంటి పన్నెండు పూర్ణ కుంభ మేళాలు పూర్తి అయిన తరువాత, అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్ లో మహా కుంభ మేళా నిర్వహిస్తుంటారు.
`కుంభం’ కథేంటీ ?
కుంభమేళా రావడానికి పురాణపరమైన చక్కటి కథ ప్రచారంలోఉంది. అది కృతయుగం. అప్పట్లో క్షీరసాగర మధనం జరిగింది. ఆసమయంలోనే అమృతకలశం ఆవిర్భవించింది. ఈ అమృతాన్ని సేవిస్తే అజేయులవుతారని ఇటు దేవతలకు, అటు దానవులకూ తెలుసు. అందుకే దీన్ని అసురలకు అందకుండా చేయాలని అమృతభాండాన్ని ఇంద్రుడి కుమారుడైన జయంతునికి అప్పగించారు. అమృతం కోసం యుద్ధం ప్రారంభమైంది. 12రోజులు హోరాహోరీగా పోరాటం సాగింది. ఈ పెనుగులాటలో అమృతభాండం (కుంభం లేదా కుండ) నుంచి నాలుగు బిందువులు ఈ భూమిమీద నాలుగు వేరువేరు చోట్ల పడ్డాయి. ఆ నాలుగు ప్రాంతాలే – హరిద్వార, ప్రయాగ, ఉజ్జయని, నాసిక్. అమృత బిందువులు పడిన నాలుగు నలుగు నదుల్లో 12 ఏళ్లకొకసారి అమృత కుంభోత్సవం జరుపుకుంటారు. అదే కుంభమేళాగా మారిపోయింది.
ఇదంతా విన్నతర్వాత మీకేమనిపిస్తుంది. ఛలో నాసిక్ అనుకుంటూ గోదావరి కుంభమేళాకు వెళ్లాలనిపించడంలేదూ. కనుక, గోదావరి పుష్కరాలు అయిపోయాయని దిగులు మానేసి, నిదానంగా నాసిక్ యాత్రకు ప్లాన్ చేసుకోండి. ఆన్ లైన్ ద్వారా సమాచారం సేకరించి, నమ్మకమైన రీతిలో వసతి, ఇతర ఏర్పాట్లు చేసుకోవడం మరువకండి. అలాగే, జాగ్రత్తలు పాటిస్తూ సౌకర్యకరమైన పవిత్ర స్నానం చేయడమం చాలా ముఖ్యమన్న సంగతి మరువరాదు. ఆల్ ద బెస్ట్.
– కణ్వస
kanvasa19@gmail.com