పోలవరం ప్రాజెక్టు కట్టవలసిందే! అయితే, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచీ రాష్ట్రాన్ని పాలించిన పార్టీలు, ముఖ్యమంత్రులు చెబుతున్నట్టు ”వృధాగా సముద్రంలో కలసిపోతున్న నదీ జలాలను నివారించడానికి” అన్న ప్రచారం వాస్తవం కాదు! ఇది ప్రజలను తప్పుదారి పట్టించడమే!!
జీవనది చివరి మజిలీ సముద్రమే…ఆప్రవాహాన్ని దోసిళ్ళు పట్టి తెచ్చుకోవలసిన వాళ్ళమే తప్ప మొత్తం తెచ్చి ఇంట్లో కట్టేసుకోవడమంటే చూస్తూ చూస్తూ సముద్రంలో మునిగి పోవడమే! పైగా అది అసాధ్యం కూడా! ”వృధాగా సముద్రంలో కలుస్తున్న” గోదావరి పరిమాణం 3 వేల టిఎంసి లైతే అందులో అతిపెద్దదనుకున్న పోలవరం ప్రాజెక్టు దాచిపెట్టకలిగింది కేవలం 175 టిఎంసిలు మాత్రమే!
ఉదాహరణకు గోదావరి నదినే తీసుకుంటే జూన్ మొదలు ఆగస్టు నెలల మధ్య మూడేళ్ళకోసారి వచ్చే పది రోజుల వరద కాలంలో అత్యధికంగా 3 వేల టిఎంసిలు ( 1టిఎంసి అంటే 100 కోట్ల ఘనపు అడుగులు) నీరు సముద్రంలోకి వెళ్ళిపోతున్నది. దీని ప్రవాహవేగం / వెలాసిటీ అత్యధికంగా 20 లక్షల క్యూసెక్కులు.(క్యూసెక్కు అంటే ఒక పాయింటు నుంచి ఒక సెకెను లో వెళ్ళిపోయే ఘనపు అడుగుల నీటి ప్రవాహం)
మామూలు రోజుల్లో గోదావరిలో ధవిళేశ్వరం బ్యారేజి వద్ద అత్యల్పంగా 80 టిఎంసిల నీరు వుంటుంది. 100 క్యూసెక్కుల ప్రవాహం కూడా లేని పరిస్ధితి వారాల తరబడి కొనసాగుతుంది. సగటున గోదావరి పరిమాణం 1500 టిఎంసిలు, ప్రవాహం 50 వేల క్యూసెక్కులు. ఇందులో గోదావరి మూడు డెల్టాలకూ కలిపి మొదటి పంటలో రెండు నెలల పాటు కావలసింది కేవలం 100 టిఎంసిలనీరు. కేవలం 15 వేల క్యూసెక్కుల ప్రవాహం. (పశ్చిమగోదావరి జిల్లాలోని 5 లక్షల ఎకరాల పశ్చిమ డెల్టాకు 9 వేల క్యూసెక్కులు, తూర్పుగోదావరి జిల్లాలోని 3 లక్షల ఎకరాల తూర్పు డెల్టాకు 4 వేల క్యూసెక్కులు ఇదేజిల్లాలోని కోనసీమలో 2 లక్షల ఎకరాల సెంట్రల్ డెల్టాకు 2 వేల క్యూసెక్కుల నీరు అవసరం) ఈ పాటి నీరు కూడా లేక మూడు డెల్టాల్లోనూ కాలవ చివరి భూములు ప్రతీ రెండేళ్ళకూ ఒకసారి ఎండిపోయి దిగుబడులు పడిపోతున్నాయి.
వరదకాలంలో విరుచుకు పడే అపారమైన జలరాసులలో మనకు సమృద్దిగా దాచుకోడానికి స్టోరేజీ లేకపోవడమే అసలు సమస్య. పోలవరం ప్రాజెక్టే ఈ సమస్యకు పరిష్కారం! అంత పెద్ద ప్రాజెక్టు అయినా 175 టిఎంసిల నీటిని, 3 లక్షల 60 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని మాత్రమే ఇవ్వగలదు. ఆ కాస్త పరిణామమే కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో మరో 12 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకు రాగలుగుతుంది. దిగువ ఉన్న గోదావరి డెల్టాలకు కొరత లేకుండా నీరు ఇస్తుంది.
కేంద్రం నిధులివ్వకపోతే పోలవరం ప్రాజెక్టును నిర్మించుకోవడం కష్టమే! ఆ వాస్తవాన్ని పక్కకి నెట్టేసి పోలవరానికి తాత్కాలిక ప్రత్యామ్నాయం పట్టిసీమ ఎత్తిపోతల పధకం, అలాగే పోలవరానికి తాత్కాలిక ప్రత్యామ్నాయం పుష్కర ఎత్తిపోతల పధకం అనడం ప్రజలను పక్కదారి పట్టించడమే! సమస్యను పరిష్కరించడం కాక మరో చోటుకి బదిలీ చేయడమే!!
సీతానగరం ఎగువన పుష్కర పధకం వల్ల లక్షఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇది మంచి పరిణామమే! అయితే రాష్ట్రంలోనే 7 వ పెద్ద పట్టణమైన గోదావరి తీరనగరం రాజమహేంద్రవరంలో ని సగం ప్రాంతంలో ఏడాదిలో 5 నెలలపాటు రోజువిడిచి రోజు తాగునీరు ఇచ్చే దుస్ధితి మున్సిపల్ కార్పొరేషన్ కు ధవిళేశ్వరం ఆర్మ్ కి అందువల్ల తూర్పు డెల్టాకి నీరు తగ్గించే పరిస్ధితి జలవనరుల శాఖకూ దాపురించింది. పట్టిసీమ వల్ల ఇదే అవస్ధ పశ్చిమడెల్టాకు దాపురించింది.
ఈ తేడాను అనుభవిస్తున్న రైతులు ఈ తరహా నదుల అనుసంధానాన్ని ఆమోదించగలరా? అసలు ఇది నదుల అను సంధానమే కాదు. ఇదే నదీ అను సంధానమైతే గోదావరి, కృష్ణా డెల్టాలను కలపడమే కాక కాకినాడ నుంచి మద్రాసు వరకూ వున్న బకింగ్ హామ్ కాల్వ ను ఏమనాలి? ఆవిధంగా రెండు నదులనూ అను సంధానం చేసిన సర్ ఆర్ధర్ కాటన్ చేసిన పనిని ఏమనాలి? మరి ఇపుడు ఆ అనుసంధానం ఎందుకు ఆగిపోయింది? నదుల్లో నీళ్ళు లేకేకదా? వేసవిలో నీళ్ళు లేని పరిస్ధితి ఇప్పటికీ అలాగే వుంది కదా?
మరి అనుసంధానం సాధించింది ఏమిటి?
స్టోరేజి ట్యాంకు లేకుండా సముద్రంలో కలసిపోతున్న నీటి వృధాని అరికడుతున్నామంటే ఎలా? పోలవరం ప్రాజెక్టే రాష్ట్రంలో సాగునీటికీ, తాగునీటికీ అతి పెద్దపరిష్కారం అవుతుంది. పట్టిసీమ కాదు… పైగా అది ప్రాంతాల మధ్య వైషమ్యాలకు కారణమౌతుంది కూడా!
కృష్ణానది మీద ఎగువ మూడు రాష్ట్రాల్లో అనేక ప్రాజెక్టులు వుండటం వల్ల ఆనది నుంచి మనకి అందే నీళ్ళు తక్కువ…గోదావరి అలాకాదు…ఎగువన ప్రాజెక్టులు దాదాపులేవు. రిజర్వాయిర్లు కట్టే అనుకూలత వున్న ప్రాంతాలు గోదావరి ఎగువన తక్కువగా వుండటం వల్ల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆశ పోలవరం ప్రాజెక్టే! గోదావరి నదే!