గోదావరి పుష్కరాలకు ఏకారణాలవల్ల అయినా కాని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకాకపోవడంలో ఒక ఉన్నతప్రమాణానికి కట్టుబడిఉన్నట్లు కనబడుతోంది. అన్నిరకాల మత కార్యక్రమాలకు విశ్వాసాలకూ ప్రభుత్వం దూరంగా వుండాలన్న లౌకిక స్పూర్తి ఆయన గైర్హాజరీలో వున్నట్టు భావించవచ్చు. సొంతవిశ్వాసం ఏదైనప్పటికీ, మత పరమైన అజెండా వున్న పార్టీ మనిషైనప్పటికీ రాజ్యాంగం విధించిన ‘లౌకిక’ హద్దు దాటకుండా వుండటం మంచివిషయమే..
1992లో విజయవాడలో కృష్ణా పుష్కరాలను, 2003లో రాజమండ్రిలో గోదావరి పుష్కరాలను నిర్వహించిన ప్రభుత్వాధికారులు, ప్రజలకు అన్నివిధాలా సౌకర్యాలు కల్పించటమేతప్ప పుష్కరాలతో ప్రభుత్వానికి సంబంధం లేదని విలేకరుల ప్రశ్నలకు సమాధానంగా వివరణ ఇచ్చారు. ఆ అధికారుల ఆలోచనల్లో అయినా లౌకిక స్ఫూర్తి ఉన్నట్లు అవగతమయింది. ఇపుడా పరిస్ధితే లేదు. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల వ్యవహారశైలివల్ల మత,ధార్మిక,సాంస్కృతిక క్రతువు అయిన పుష్కరాలను ప్రభుత్వమే నెత్తిన వేసుకున్న సంకేతం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ప్రభుత్వం పుష్కర యాత్రలకు ప్రచారం కల్పిస్తూ కోట్ల రూపాయ లు ఖర్చుచేస్తోంది. బస్సు ల్లో ప్రజలను పుష్కరాలకు తరలించాలని స్వయంగా ముఖ్యమంత్రి కలెక్టర్లను ఆదేశించారు. పుష్కరాలను ప్రభుత్వం నెత్తిన వేసుకుందనడానికి ఈ రెండూ ప్రబల సాక్ష్యాలే! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మతవాదికాకపోయినా, గొప్ప ఈవెంట్ మేనేజర్ గా ప్రపంచం ప్రశంసించాలన్న గాఢమైన కోరికవల్ల పుష్కరాల్లో ఇరుక్కుపోయారు. వినియోగించుకుంటున్నారు.ఇతరమతాలవారు తమ క్రతువులను ఎందుకు నిర్వహించడం లేదంటే చంద్రబాబు ప్రభుత్వం ఏమి సమాధానం చెబుతుంది? ఇది డబ్బు సమస్య కాదు. ఒకమతం వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యమూ ప్రమేయమూ వుండకూడదన్న లౌకక ధర్మం హద్దు దాటిన ఫలితంగా తలెత్తే వివాదం.
బడ్జెట్ లో కాని, 14 వ ఆర్థికసంఘం కేటాయింపులలో కాని చూపకుండా గోదావరి పుష్కరాల ప్రచారానికి చేసే ఖర్చు కచ్చితంగా సబ్ ప్లాన్ వంటి ఖాతాల నుంచే మళ్లించే ప్రమాదం వుందని కవి, సాంక్కృతిక ఉద్యమకారుడు కత్తి పద్మారావు వ్యాఖ్యానించారు. మోడీ హయాంలో రాజకీయాలు కార్పొరెట్ చేతికి వెళ్లిపోవడంతో, వాటిలో తగ్గిపో తున్న మానవ విలువలను మత విలువలతో నింపాలని బిజెపి ప్రయత్నిస్తుందని , చంద్రబాబు వంటి వారు ఆ మార్గంలో పయనిస్తున్నారని నాస్తిక ఉద్యమ కారుడు లవణం అంటున్నారు. ఆదిమ భారతీయులు నదులను ప్రకృతి వనరు గానే పరిగణించేవారు. ఆధిపత్యం నిలుపుకునే క్రమంలో ఆర్యులు ఆ శాస్త్రీయ విశ్వాసాన్ని దెబ్బతీసి నదీస్నానమంటే పుణ్యదాయకమనే నమ్మకాన్ని ప్రవేశపెట్టారు. అలాంటి నమ్మకాలతో ప్రజలు గోదావరిలో మునగడం వేరు. ప్రభుత్వమే వారిని ముంచెయ్యడం వేరు…పుష్కరాల్లో లౌకికత్వం హద్దుదాటినట్టున్న ప్రభుత్వ ధోరణి హేతువాదులకు, రాజ్యాంగ స్పూర్తికి అభ్యంతరకరమే!