సినీపాటల్లో గోదావరి (పార్ట్ 4)
`చిల్లరకొట్టు చిట్టెమ్మ’ అనే చిత్రం 1977లో వచ్చింది. ఈ సినిమాలో జీవితసారాన్ని కాచివడబోసిన తత్వగీతం ఒకటుంది. అదే… – `తల్లి గోదారికే ఆటుపోటుంటే, తప్పుతుందా మనిషికీ..తప్పుతుందా మనిషికీ.. ‘
మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు నిండుగోదారి మన ఎదుట నిలబడి ఊరడిస్తుందా అన్నట్టు సాగుతుంటుంది ఈ పాట. సి. నారాయణరెడ్డిగారు రాసిన ఈ పాటలో జీవిత సారాన్ని సినారే అక్షరనిక్షిప్తం చేశారేమో అనిపిస్తుంది.
2015 గోదావరి మహాపుష్కరాల ప్రారంభంలోనే విషాద సంఘటన జరిగి 29 మంది మరణించడం అందర్నీ కలచివేసింది. అలాంటప్పుడే మనసు దిటవుచేసుకోవాలి. భగవద్గీత సారాన్ని అర్థంచేసుకోవాలి. జీవితమనే చట్రంలో గెలుపుఓటములు, కష్టసుఖాలు, కలిమిలేములు గిర్రున తిరుగుతుంటాయి. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడే ఊరట కలుగుతుంది. ఈ పాట వింటుంటే, గుండె బరువుతగ్గినట్టు అనిపిస్తుంటుంది.
వెలుగు వెనకాలే చీకటి ఉంటుందని మనకు తెలుసు, మరి అలాంటప్పుడు చీకటికి దడిసి పారిపోతామా ? అలాగే, మండే సూర్యుడిని మబ్బు కమ్మేయడం సహజమేగా, చంద్రుడ్ని అమవాస్య మింగేయడం కూడాఅంతే సహజం, అలాంటప్పుడు తలరాత తప్పుతుందా ? అని కవి ఊరట కల్పించే ప్రయత్నం ప్రారంభిస్తాడు ఈ పాటలో. అవతార పురుషుడైన రామచంద్రుడే అడవులపాలయ్యాడుగా, అంతటాతానైన గోపాలకృష్ణుడే అపనిందలు పాలయ్యాడు, మరి మనమెంత అంటూ పెద్దగీత గీసేసి మన కష్టం చిన్నగీత అనిపించేలా చెదరిన మనసుకు స్వాంతన చేకూరుస్తాడు కవి. కొద్దిపాటి అపజయం, కష్టం రాగానే విలవిల్లాడేవారు మానసిక ధైర్యం పొందాలంటే ఇలాంటి పాటలు వినాలి.
ఈ పాటకు రామానాయుడు సంగీతం సమకూర్చారు. చిల్లరకొట్టు చిట్టెమ్మ టైటిల్ తో గోదావరి జిల్లాల్లో నాటకం అప్పట్లో చాలాచోట్ల ప్రదర్శించేవారు. దాసం గోపాలకృష్ణ రాసిన నాటకం అలా బాగా ప్రసిద్ధి చెందింది. ఈ నాటకం ఆధారంగానే దర్శకుడు దాసరి నారాయణరావు అదే టైటిల్ తో సినిమా తీశారు. మాడా వేసిన నపుంసక వేషం పాపులరైంది. మాడా పాత్రకోసం ఎస్పీపాడిన – `చూడు పిన్నమ్మా, పాడు పిల్లడు’ – పాట కూడా అంతే పాపులరైంది. ఈ పాట నాటకంలో కూడా ఉందని అంటారు. దీన్ని నాటక రచయిత దాసంగారే రాయడం గమనార్హం. ఇదే చిత్రంలో `చీటికిమాటికి చిట్టెమ్మంటే చీపురు దెబ్బలు తింటవురో…’దాసంగారే రాసిన మరో పాట కూడా ప్రజాదరణ పొందింది. సినిమాలో చిల్లరకొట్టు చిట్టెమ్మగా జయచిత్ర నటించగా, మురళీమోహన్, గోకిన రామారావు, మాడా ప్రధానపాత్రలు పోషించారు.
గోదావరిపై వచ్చిన పాటల్లో జీవిత సారాన్ని కాచి వడబోసిన ఒకపాటగా దీన్ని చెప్పుకోవచ్చు. అందుకే ఓ సారి వినండి మరి.
– కణ్వస