ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూల వాతావరణం ఏర్పడటం, ప్రభుత్వపరంగా అండగా ఉంటామన్న భరోసాకు తోడు… సులభంగా అనుమతులపై సీఎం చంద్రబాబు పట్టుదలతో ఉన్న నేపథ్యంలో ఒక్కో కంపెనీ ఏపీకి వచ్చేందుకు మొగ్గు చూపుతున్నాయి.
ఇప్పటికే టాటా కంపెనీతో పాటు పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు రెడీగా ఉండగా… తాజాగా గోద్రెజ్ కూడా పెట్టుబడి పెట్టనుంది. అమరావతితో పాటు విశాఖపట్నంలో తమ కంపెనీ 2800కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రకటించింది. గోద్రెజ్ సీఎండీ నాదిర్ గోద్రేజ్ ఈమేరకు సీఎం చంద్రబాబును కలిశారు.
అగ్రి, ఆక్వా, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు గోద్రేజ్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వీటి వల్ల ఏపీ ఆర్థిక రంగం బలోపేతం అయ్యేందుకు అవకాశం కూడా ఉంటుందని, పైగా రైతులకు కూడా మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవచ్చని ప్రభుత్వం అభిప్రాయపడింది.
ఏపీకి కొత్తగా రాబోతున్న కంపెనీలన్నీ ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా… అమరావతితో పాటు విశాఖలోనూ తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు రావటం శుభపరిణామంగా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. తద్వారా అభివృద్ధి సమతుల్యతతో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందుతాయి.