రెండు తెలుగు రాష్ట్రాలలో బలపడి, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని భాజపా గట్టిగా కోరుకొంటోంది. దాని కోసమే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిన్న రెండు రాష్ట్రాల భాజపా నేతలతో సమావేశమయ్యి అన్ని విషయాల గురించి చర్చించారు. అందరికీ తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. త్వరలో రెండు రాష్ట్రాలలో పర్యటిస్తానని హామీ ఇచ్చారు.
అయితే భాజపా నేటికీ అసలు సమస్యలని ఇంకా సరిగ్గా గుర్తించలేదనే చెప్పవలసి ఉంటుంది. రెండు రాష్ట్రాలలో అధికార, ప్రతిపక్ష స్థానాలలో ఉన్న ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. కుల సమీకరణాలు, సెంటిమెంట్లు ఇంకా అనేక ఇతర కారణాల వలన ప్రజలు వాటి మధ్యనే చీలిపోయున్నారు. వాటి ప్రభావంలో ఉన్న ప్రజలపై మోడీ ప్రభావం ఉండదనే సంగతి భాజపా నేతలు గ్రహించినట్లు లేదు. కనుక మోడీ పేరు చెప్పి రాష్ట్రంలో భాజపాని బలోపేతం చేసుకోవాలనే ఆలోచనే తప్పు. ఆయన పేరుని కేవలం ప్రచారానికి మాత్రమే ఉపయోగించుకొంటే సరిపోతుంది. అందుకు బదులు రాష్ట్ర భాజపా నేతలు తమ స్వశక్తితో పార్టీని గ్రామస్థాయి వరకు విస్తరించుకోవలసి ఉంటుంది.
అలాగే హిందూమతం గురించి భాజపా ఎక్కువగా మాట్లాడటం కంటే ప్రాంతీయ పార్టీల మాదిరిగానే కులసమీకరణాలని అలవరచుకోవలసి ఉంటుంది. ఉత్తరాది పార్టీ అనే ముద్రని వదిలించుకోవడానికి కూడా భాజపా గట్టిగా ప్రయత్నం చేయవలసి ఉంది. అందుకోసం రెండు రాష్ట్రాలలో బలమైన నేతలని తయారుచేసుకోవలసి ఉంటుంది.
చంద్రబాబు నాయుడు, దేవినేని, గంటా, ప్రత్తిపాటి, అచ్చెంనాయుడు, కెసిఆర్, కెటిఆర్, కవిత, హరీష్ రావు, జగన్మోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ తదితర ప్రాంతీయ పార్టీల నేతలకి ప్రజలలో మంచి ఆదరణ, బలం, గుర్తింపు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం భాజపాలో అటువంటి నేతలని వ్రేళ్ళపై లెక్కించవచ్చు. కనుక అటువంటి నేతలని భాజపా కూడా తయారుచేసుకొంటే ఏమైనా ప్రయోజనం ఉంటుంది తప్ప మోడీ భజన చేయడం వలన ఉపయోగం ఉండదు. మొట్టమొదట పార్టీలో అటువంటి నేతలని గుర్తించి వారిని ప్రోత్సహించాలి. లేకుంటే జాతీయ రాజకీయాలలోకి తీసుకువెళ్ళిన కేంద్ర మంత్రుల్ని, నేతలని వెనక్కి రప్పించి రెండు తెలుగు రాష్ట్రాలలో బలమైన నాయకత్వం సృష్టించుకోగలిగితే, అప్పుడు వారి నేతృత్వంలో పార్టీని బలోపేతం చేసుకొనే ప్రక్రియ మొదలుపెట్టవచ్చు.
కేంద్రప్రభుత్వం పధకాల గురించి భాజపా ప్రచారం చేసుకోవడం అవసరమే. కానీ దానితోనే బలపడవచ్చనుకొంటే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు. అయినా రాష్ట్ర భాజపా నేతలు మోడీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి, అయన సాధిస్తున్న విజయాల గురించి గట్టిగా ప్రచారం చేసుకోకుండా చాలా అశ్రద్ధ వహిస్తున్నారు. వారి బలహీనతని చూసి రాష్ట్ర ప్రభుత్వాలు అవన్నీ తమ పదకాలేనని గట్టిగా ప్రచారం చేసుకొని ప్రజలని ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. అప్పుడు రాష్ట్ర భాజపా నేతలు వారిని విమర్శిస్తుంటారు. దాని వలన భాజపాకి మేలుకి బదులు కీడే జరుగుతుంది. ప్రజలు అభిమానిస్తున్న ప్రాంతీయ పార్టీల నేతలపై వారు ఎన్నుకొన్న ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తే భాజపా పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుందని గ్రహించినట్లు లేదు.
ఇక తెలంగాణాలో తెరాసని ఏవిధంగా కట్టడి చేయాలో, ఆంధ్రాలో తెదేపాతో ఏవిధంగా మెలగాలనే దానిపైనా భాజపాకి ఇంతవరకు స్పష్టత లేదు. కనుక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని కలలుకనే ముందు భాజపా ఈ బలహీనతలని, లోపాలని సరిదిద్దుకోవడం అవసరం.