కుప్పం నియోజకవర్గంలో చిగురుగుంట ప్రాంతంలో బంగారు గనులున్నాయి. కానీ ముఫ్ఫై ఏళ్ల కింద మూతపడ్డాయి. ఇప్పుడు ఆ బంగారు గనులను పునరుద్దరించనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ మైనింగ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పరీక్షలలో టన్నుకు 5 గ్రాములకు పైగా బంగారం లభ్యమయ్యే అవకాశముందని తేలింది. దీంతో తవ్వకాలు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. అప్పట్లో క్వార్ట్జ్ రాయిని వెలికి తీసి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో ప్రాసెస్ చేసేవారు. గనులు మూతపడిన తర్వాత పట్టించుకోలేదు.
ఆ గనులను తిరిగి మొదలు పెట్టడానికి అనుమతులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఒప్పందంలో భాగంగా వచ్చే ఆదాయంలో 38. 25 శాతం వాటాను ప్రభుత్వానికి ఇవ్వడానికి ఎన్ఎండిసి సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఎన్ఎండిసి చిగురుగుంట, బిసానత్తం ప్రాంతాల్లోనే బంగారం శుద్ధి చేసే ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. లాక్ ఔట్ అయినా తరువాత ఆ మైన్స్‌లో లోని యంత్ర సామాగ్రి 90 శాతం నిరుపయోగంగా మారిందని తెలుస్తోంది. తాజా మైనింగ్ కార్యక్రమంలో భాగంగా తవ్వే సొరంగాలలో పని చేయడానికి కనీసం రెండు వేలమంది కార్మికులు, మరో వెయ్యి మందికి పైగా నిపుణులు అవసరమని ఎన్ఎండిసి అధికారులు భావిస్తున్నారు.
ఎన్ఎండిసి రెండు గ్రామాల గనులను రూ. 500 కోట్ల తో దక్కించుకుంది. మైసూర్‌కు చెందిన జియో అనే సంస్థ ద్వారా ఆ రెండు గ్రామాల పరిసరాలలోని 19 కిలోమీటర్లకు చెందిన 260 హెక్టార్ల భూముల్లో దాదాపు వందకు పైగా బోర్లు తవ్వించి సాంకేతిక పరీక్షల సర్వే చేయించింది. గోల్జ్ ఉన్నట్లుగా తేలింది. అన్ని అనుమతులు వచ్చి మైనింగ్ పనులు మొదలైతే ఇక కుప్పం మరో కేజీఎఫ్ అవుతుంది .నిజంగా .. లాభదాయకం అయితే.. మరో ఓబులాపురం అయినా ఆశ్చర్యపోవాల్సిన పని ఉండదు.