అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు ప్రపంచం అతలాకుతలం అయిపోతోంది. అందరూ సురక్షిత పెట్టుబడిగా బంగారాన్ని భావిస్తున్నారని అనుకున్నారు. దానికి తగ్గట్లుగా వారం రోజుల కిందట వరకూ బంగారం హైకి వెళ్లిపోయింది. కానీ హఠాత్తుగా తగ్గుదల ప్రారంభమయింది. కొంత మంది అంతర్జాతీయ విశ్లేషకులు పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ.50వేలకు పడిపోతుందని కొత్త కథలు చెబుతున్నారు. దీంతో అసలేం జరుగుతోందన్న ప్రశ్న చాలా మందిలో వస్తోంది.
అమెరికన్ డాలర్ విలువ పెరగడం వల్ల బంగారం ధరలు తగ్గుతున్నాయి. డాలర్ బలపడితే, బంగారం కొనుగోలు ఖర్చు తగ్గుతుంది, దీని వల్ల డిమాండ్ తగ్గి ధరలు పడిపోతాయని నిపుణులు చెబుతున్నారు. డాలర్ ఇండెక్స్ ఇటీవల బలంగా ఉందని, దీనివల్ల బంగారం కొనుగోలు ఖర్చు తగ్గుతోందని నివేదికలు సూచిస్తున్నాయి. బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరినప్పుడు, పెట్టుబడిదారులు లాభాలను ఆర్జించేందుకు బంగారాన్ని విక్రయిస్తారు. ఈ “ప్రాఫిట్ బుకింగ్” వల్ల సరఫరా పెరిగి ధరలు తగ్గుతున్నాయని అంచనా వేస్తున్నారు.
అయితే బంగారం ధర కొంత మంది నిపుణులు అంచనా వేసినట్లుగా .. యాభై వేలకు దిగే అవకాశాలు మాత్రం ఉండవని అంటున్నారు. తాత్కలికంగా దిగువకు వచ్చినా బంగారం ధర ఓ సారి హై ను అందుకున్న తర్వాత త్వరగానే మళ్లీ ఆ బెంచ్ మార్క్ ను అందుకుంటుందని భావిస్తున్నారు. అలాగే ధరలు పెరిగిపోవడం వల్ల ఎక్కువగా బంగారం కొనుగోలు చేసేవారు తక్కువగా ఉండటం వల్ల డిమాండ్ కూడా తగ్గుతుంది.