సౌత్ సినిమాల్ని హిందీలో డబ్ చేసి, మన హీరోల్ని అక్కడ పరిచయం చేసిన సంస్థల్లో గోల్డ్ మైన్ మూవీస్ ఒకటి. అప్పట్లో దక్షిణాది యాక్షన్ సినిమాలన్నీ టోకున కొనేసి, హిందీలో డబ్ చేసి, మంచి లాభాలు గడించింది. హిందీ డబ్బింగ్ మార్కెట్లో గోల్డ్ మైన్ కింగ్ అనుకోవొచ్చు. ఇప్పుడు స్ట్రయిట్ సినిమాలపై దృష్టి పెట్టిందీ సంస్థ. ఒకేసారి 17 సినిమాల్ని పట్టాలెక్కించడానికి ప్రణాళికలు వేసుకొంటోంది. అందుకు సంబంధించి కథలు కూడా సిద్ధం చేసింది. వాటిలో రెండు సినిమాల్లో లారెన్స్ హీరో.
లారెన్స్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న `కాంచన 4` గోల్డ్ మైన్ సంస్థే రూపొందిస్తోంది. దీంతో పాటుగా రమేష్ వర్మ దర్శకత్వంలో లారెన్స్ హీరోగా `కాలభైరవ` తయారవుతోంది. ఇది కూడా ఈ సంస్థలోనే తయారవుతోంది. మరో 4 కథలు రెడీ అయ్యాయి. హీరోలు ఫిక్సయితే చాలు. గోల్డ్ మైన్ ఎక్కువగా సౌత్ సినిమాలపై దృష్టి పెట్టింది. ఈ 17 సినిమాలూ ఈ యేడాదే పట్టాలెక్కించాలని భావిస్తోంది. ఓ సంస్థ ఒకేసారి ఇన్ని సినిమాల్ని భుజాన వేసుకోవడం ఓ రికార్డు. తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇలాంటి ప్రయోగాలు చేసింది. తక్కువ సమయంలో వంద సినిమాల్ని పూర్తి చేయాలన్న లక్ష్యం పీపుల్ మీడియా ఫ్యాక్టరీది. బహుశా గోల్డ్ మైన్ కూడా అదే ఉద్దేశంతో సినిమా నిర్మాణంలో అడుగు పెట్టిందేమో?!