తెలంగాణ నాయకుడు గోనె ప్రకాష్ రావు ఒకప్పుడు వైఎస్ కు వీరవిధేయుడు. ఇప్పుడు ఏమయిందో కానీ ఆ ఇంట్లోని గుట్టు అంతా తనకు తెలుసని.. అవసరం లేకపోయినా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. తాజాగా మరోసారి ఆయన మీడియా ముందుకు వచ్చారు. వైఎస్ జగన్, షర్మిల మధ్య ఉన్న విబేధాల గురించి మాట్లాడారు. షర్మిలపై జగన్ కు చాలా కోపం ఉందని.. కొన్ని ఉదాహరణలు చెప్పారు.
షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకున్న తర్వాత ఏపీ నుంచి ఓ సిట్టింగ్ ఎంపీ వచ్చి షర్మిలను కలిశారట. పార్టీ పెట్టుకున్నందున చాలా ఖర్చులు ఉంటాయని తాను ఐదు కోట్లు ఆర్థిక సాయం చేస్తానని హమీ ఇచ్చారట. అయితే ఈ విషయం తెలిసిన జగన్మోహన్ రెడ్డి ఆ ఎంపీని పిలిచి తీవ్ర స్థాయిలో మందలించారని గోనె ప్రకాష్ రావు చెబుతున్నారు. ఎందుకు ఆర్థిక సాయం చేస్తానని వెళ్లావని ఆయనపై మండిపడ్డారట. షర్మిలపై జగన్ కు అంత కోపం ఎందుకని ఆయన ప్రశ్నిస్తున్నారు.
అవినాష్ రెడ్డి రెండు రోజుల్లో అరెస్ట్ అవుతారని గోనె ప్రకాష్ రావు జోస్యం చెబుతున్నారు. ఇలాంటి మాటలతో పాటు ఆయన సర్వేలూ చేస్తున్నారు. ఆయన ఏ సర్వేల గురించి చెబుతున్నారో కానీ .. ఒకప్పుడు తన రాజకీయ దైవం అయిన రాజశేఖర్ రెడ్డి కుమారుడి గురించి మాట్లాడటం లేదు. టీడీపీ గెలుస్తుందని ఆయన చెబుతున్నారు. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే వంద సీట్లు.. జనసేనతో కలిసి పోటీ చేస్తే 150 సీట్లు వస్తాయని చెబుతున్నారు. మంచి వాగ్ధాటి ఉన్న నేత కావడంతో ఆయనకు యూట్యూబ్ చానళ్లు మంచి ప్రయారిటీ ఇస్తున్నాయి.