Good Bad Ugly Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 2.5/5
కమర్షియల్ మాస్ మసాలా కథలు రెండు రకాలు. అన్నీ హంగులతో ఒక కొత్త కథ రాసి హీరో ఇమేజ్ ని బిల్డ్ చేయడం ఒక పద్దతి. హీరో ఇమేజ్ వాడేసి ఒక కథని సృష్టించుకోవడం మరో పద్దతి. అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఈ రెండో కోవకి చెందుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో అధిక్ రవిచంద్రన్ దర్శకుడికి రూపొందిన ఈ సినిమా కథకి ముడిసరుకు అజిత్ ఇమేజ్. అజిత్ మాస్, వింటేజ్ మూమెంట్స్ అన్నీ మిక్స్ చేసి తయారు చేసిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచింది? ఇందులో గుడ్ ఎంత? బ్యాడ్, అగ్లీ ఎంత?
ఏకే అలియాస్ రెడ్ డ్రాగన్( అజిత్) అండర్ వరల్డ్ ని శాశించే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. తన భార్య రమ్య (త్రిష)కి ఇచ్చిన మాట ప్రకారం అండర్ వరల్డ్ వదిలేస్తాడు. 18 ఏళ్లు జైలు జీవితం గడిపి మళ్ళీ ఓ మామూలు మనిషిలా బ్రతకాలని అనుకుంటాడు. జైలు శిక్ష పూర్తి చేసుకొని కొడుకు విహాన్(కార్తికేయ )18వ పుట్టిన రోజున తొలిసారి కొడుకుని కలవాలని ఆశపడతాడు. అన్నీ సజావుగా సాగుతున్న సమయంలో విహాన్ ఓ డ్రగ్ కేసులో జైలుకి వెళ్తాడు. దీని వెనుక జామీ (అర్జున్ దాస్) ఉన్నాడని ఏకే కి తెలుస్తుంది. అసలు ఈ జామీ ఎవరు? ఏకే, జామీ మధ్య వున్న పాత రివెంజ్ ఏమిటి? జైలు నుంచి కొడుకుని బయటకి తీసుకురావడానికి ఏకే ఏం చేశాడనేది మిగతా కథ.
సైన్స్ ఫిక్షన్ లో కామెడీ చేసి ‘మార్క్ ఆంటోని’ లాంటి డిఫరెంట్ సినిమా తీసిన దర్శకుడు అధిక్ రవిచంద్రన్. తను అజిత్ తో సినిమా చేస్తున్నాడంటే ఈసారి ఎలాంటి కొత్తదనం చూపిస్తాడనే ఆసక్తి వుంటుంది. అయితే దర్శకుడు అలాంటి కొత్తదనం ఆలోచనలు పెట్టుకోలేదు. తన బుర్రకి ఎలాంటి శ్రమ లేకుండా అజిత్ ని ఒక ఫ్యాన్ బాయ్ లా చూపిస్తూ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తీశాడు.
సినిమా అంటే ముందుగా ఎవరైనా కథ గురించి మాట్లాడుతారు. అయితే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో ఆ ఛాన్స్ లేదు. ఈ కథ గురించి పెద్ద చెప్పడానికి ఏమీ లేదు. ఆ సంగతి దర్శకుడికి కూడా తెలుసు. అందుకే కార్టూన్ తరహ ఫోటోలకు మోషన్ ఎఫెక్ట్ ఇచ్చి వాయిస్ ఓవర్ తో ఎంట్రీని తేల్చేశాడు. అప్పుడే ఈ సినిమా కథకి అస్సల్ ప్రాధాన్యత లేదనే సంగతి ఆడియన్స్ కి రిజిస్టర్ అయిపొయింది. మరి ఇందులో స్పెషాలిటీ ఏమిటంటే.. అజిత్. ఈ మధ్య కాలంలో అజిత్ ని ఈ స్థాయి ఎలివేషన్స్ తో చూపించిన సినిమా ఇదే.
ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉంటుందనే పూరి జగన్నాథ్ డైలాగ్ లా ఇందులో ప్రతి సీన్ అజిత్ ఎంట్రీ ఎలివేషన్ లానే వుంటుంది. చాలా వరకూ సీన్స్ వర్క్ అవుట్ అయ్యాయి. ముఖ్యంగా అజిత్ అభిమానులకు తెగ నచ్చేస్తాయి. కేవలం అజిత్ మాస్ ఇమేజ్ మీదే నడిపినప్పటికీ ఫస్ట్ హాఫ్ వరకూ సినిమా డీసెంట్ గానే వుంటుంది. ముంబై డాన్ డెన్ లో ఫైట్, ఇంటర్వెల్ కి ముందు క్యాసినో బ్యాంక్ లో జరిగే యాక్షన్ సీక్వెన్స్, అర్జున్ దాస్ క్యారెక్టర్ లో ట్విస్ట్.. ఇవన్నీ ఇంట్రస్టింగానే కుదిరాయి. అయితే సెకండ్ హాఫ్ లో సరైన సీన్లు పడలేదు. ఒక దశలో సినిమా డ్రాగ్ అయిపోతుంది. అవసరానికి మించి లాగుతున్నారనే ఫీలింగ్ కలిగించేస్తుంది. ఈ సినిమా క్లైమాక్స్ పై ఎవరికీ ఆసక్తి వుండదు. కారణం.. ఇదంతా అజిత్ వన్ మ్యాన్ షో. అక్కడ విలన్ బ్యాచ్ కి సీన్ ఉండదనే సంగతి ఆడియన్స్ కి ముందే ఒక క్లారిటీ వచ్చేస్తుంది.
అజిత్ కి ముఖ్యంగా తమిళనాడులో చాలా మాస్ ఫాలోయింగ్ వుంది. అలాంటి మాస్ ని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా ఇది. సినిమా అంతా కెమరా అజిత్ మీద ఫోకస్ అయి వుంటుంది. తన వింటేజ్ మ్యానరిజమ్స్, లుక్స్, సిగ్నేచర్స్ దాదాపుగా వాడేశాడు దర్శకుడు. యాక్షన్ సీన్లు లార్జర్ దెన్ లైఫ్ తరహలోనే తీశారు. త్రిషకి సరిపడే పాత్ర చేసింది. ఆ పాత్రలో హుందాగా వుంది. సునీల్ కి మంచి పాత్ర దక్కింది. జైల్లో ఒక ఫైట్ కూడా పడింది. ప్రభు పాత్రకు అంత ప్రాధాన్యత లేదు. అర్జున్ దాస్ విలన్ గా ఆకట్టుకుంటాడు. తన పాత్రలో ఓ ట్విస్ట్ వుంది. జాకీ ష్రాఫ్ పాత్ర తేలిపోయింది. ప్రియా వారియర్ ట్రాక్ అంతగా ఫిట్ అవ్వలేదు. ఆ పాత్రని ఫినిష్ చేసిన విధానం కూడా కన్వెన్సింగ్ గా వుండదు. సిమ్రాన్ అతిధి పాత్రలో కాసేపు కనిపించింది. టినూ ఆనంద్, షైన్ టామ్, కింగ్స్లీ ఈ పాత్రలన్నీ అజిత్ కి ఎలివేషన్ ఇవ్వడానికి పనికొచ్చాయి.
టెక్నికల్ గా సినిమాకి మంచి మార్కులు పడతాయి. పాటల్లో జీవి ప్రకాష్ చేసిన వర్క్ ఏమీ లేదు. తమిళ్ ఓల్డ్ హిట్స్ ఎక్కువగా వినిపిస్తాయి. నేపధ్య సంగీతం మాత్రం పవర్ ప్యాక్డ్ గా చేశాడు. అభినందన్ కెమరా వర్క్ లావిష్ గా వుంది. ఎడిటింగ్ ప్యాట్రాన్ ‘మార్క్ ఆంటోని’ని గుర్తు చేస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీదనం కనిపించింది. అజిత్ ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా ఇది. అజిత్ ఇమేజ్, అభిమానులే ఈ సినిమాకి రక్ష.
తెలుగు360 రేటింగ్: 2.5/5