హాస్యనటుడు, రచయిత హర్షవర్థన్ ఇప్పుడు దర్శకుడిగా మారాడు. రచయితలు, నటులు దర్శకులు అవ్వడం కామనే కాబట్టి… ఈ హర్షవర్థన్ దర్శకుడు అనగానే టాలీవుడ్ ఏం షాకైపోలేదు. ‘సర్లే… ఏదో తీద్దామనుకొంటున్నాడు కదా… తీయనీయ్’ అని లైట్ తీసుకొన్నారు. సదరు సినిమా వచ్చాక… జనాలు తనపై ఎలాంటి సెటైర్లు వేస్తారో ముందే ఊహించి ఉంటాడు హర్ష. ‘హాయిగా రాసుకోక.. ఈడికెందుకురా డైరెక్షనూ’ అని రాళ్లూ వేస్తారని తెలుసు. అందుకే రా ళ్లేదో, ముందు తనపై తాను వేసేసుకొంటే, ఆ ఛాన్స్ ఇంకొకరికి ఇచ్చే అవకాశం ఉండదు కదా.. అని హర్ష కాస్త తెలివిగా ఆలోచించి – ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ట్రైలర్‌ని కట్ చేశాడు.
రాంగోపాల్ వర్మ డైరెక్టర్ అవుతున్న కొత్త రోజులవి. అంటే.. ‘శివ’ టైమ్ అన్నమాట. ఆ షూటింగ్ సమయంలోనే వర్మపై సెటైర్లు వేసుకొనే ఓ బ్యాచ్, అందులో మూస సినిమాల జాడ్యం వదలని హర్షవర్థన్ లాంటి కుర్రాడు. వర్మని తిడుతూ… అలాంటి సినిమా ఏదో తానే ఎందుకు తీయకూడదు అని ఫిక్సయిపోయి సినిమా తీస్తే ఎలా ఉంటుందన్నది కాన్సెప్టు. అంటే సినిమాలో సినిమా అన్నమాట. ట్రైలర్ చూస్తే కాస్త రొమాంటిక్‌గా అనిపిస్తున్నా, మధ్య మధ్యలో ఎమోషన్ సీన్లూ కనిపిస్తున్నాయి. అయితే.. ఈ టోటల్ ట్రైలర్ ద్వారా హర్ష ఏం చెప్పాలనుకొన్నాడో అర్థం కాలేదు. కథేంటన్నది తెలీలేదు. బహుశా థియేటర్‌కి వచ్చేంత వరకూ.. కథేంటో తెలియకూడదని జాగ్రత్త పడ్డాడేమో. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే టైటిల్‌కి జస్టిఫికేషన్ చెప్పలేదు. ట్రైలర్ కూడా.. గుడ్ అనలేం, బ్యాడ్ అని తేల్చేయలం, అగ్లీ అంటూ కళ్లు మూసుకోలేం. మధ్యస్తంగానే అనిపిస్తూ… కాస్తో కూస్తో ఇంట్రస్టింగ్ కలిగించింది. అన్నట్టు ఈ సినిమాకి సంగీతం కూడా హర్షవర్థనేనండోయ్.