తెలుగు360 రేటింగ్: 1.5/5
స్పోర్ట్స్ డ్రామాలు మంచి కమర్షియల్ పాయింట్లు. పైగా… యూత్ ని ఈజీగా టార్గెట్ చేయొచ్చు. స్పోర్ట్స్ అంటే.. కచ్చితంగా ఓ విజేత ప్రయాణం. దాంతో. ఎవరైనా కనెక్ట్ అయిపోతారు. కాకపోతే… ఇలాంటి కథల్ని మెప్పించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఏ విజేత కథైనా ఒకేలా ఉంటుంది. ఆ గ్రాఫ్‌లో పెద్దగా మార్పు ఉండదు. అలాంటప్పుడు ప్రతీ కథనీ కొత్తగా చూపించడం కత్తిమీద సామే. అందుకే స్పోర్ట్స్ డ్రామాలు అయితే సూపర్ హిట్ అవుతాయి, లేదంటే ఎటూ కాకుండా పోతాయి. ఇప్పుడు అలాంటి మరో కథ వచ్చింది. అదే `గుడ్ లక్ సఖి`. కీర్తి సురేష్ మెయిన్ లీడ్ కావడం, ఇదో స్పోర్ట్స్ డ్రామా అవ్వడంతో… అందరి దృష్టీ ఈ సినిమాపై పడింది. అయితే… ఎప్పుడో విడుదల కావాల్సింది. అనుకోని అవాంతరాల్ని దాటుకుని, వాయిదాల పడుతూ, లేస్తూ..చివరికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సఖీ ఎలా ఉంది? గుడ్ లక్కా..? బ్యాడ్ లక్కా..?
సఖి (కీర్తి సురేష్) ది అంతా దురదృష్టమే. నిరు పేద కుటుంబం. సఖి – రాజు (ఆది పినిశెట్టి) చిననాటి స్నేహితులు. రాజుదేమో… నాటకాల బ్యాచు. ఆ ఊరికి మిలటరీ మాజీ కల్నల్ (జగపతిబాబు) వస్తాడు. మట్టిలో మాణిక్యాలను వెలికితీసి.. వాళ్లని గొప్ప క్రీడాకాకులుగా తయారు చేయాలన్నది కల్నల్ ప్రయత్నం. తన దృష్టి.. సఖి పై పడుతుంది. సఖికి ట్రైనింగ్ ఇచ్చి.. అంతర్జాతీయ క్రీడా కారిణిగా మార్చాలని చూస్తాడు కల్నల్. ఆ ప్రయాణంలో సఖి.. కల్నల్‌పై ఇష్టం ఏర్పరచుకుంటుంది. దాంతో రాజు దూరం అవుతాడు. నిజానికి సఖి మనసులో కల్నల్కీ, రాజుకీ ఉన్న స్థానం ఏమిటి? సఖి ఛాంపియన్‌గా వెలిగిందా? లేదా? అనేదే మిగిలిన కథ.
నగేష్ కుకునూర్ ట్రాక్ రికార్డ్ గొప్పది. `ఇక్బాల్` లాంటి గొప్ప సినిమా తీసిన దర్శకుడు ఆయన. తాను ఓ స్పోర్ట్స్ డ్రామాని ఎంచుకున్నాడు… ఆ పాత్రలో కీర్తి కనిపింస్తుందనగానే ఓ ఆసక్తి ఏర్పడుతుంది. పైగా ఈ సినిమాకి పని చేసిన స్టార్ కాస్ట్, సాంకేతిక నిపుణలు చిన్నా చితకా వాళ్లు కాదు. పోస్టర్ పై వాళ్ల పేర్లు, బొమ్మలు చూసైనా సినిమాకి వెళ్లాలనిపిస్తుంది. ఆడియన్స్ ని థియేటర్ వరకూ తీసుకొచ్చే సత్తా ఉన్న సినిమా ఇది. కానీ అది సరిపోదు. వచ్చినవాళ్లని కుర్చీలకు అతుక్కుని పోయేలా చేయగలగాలి. దురదృష్టవశాత్తూ ఈ విషయంలో గుడ్ లక్ సఖి… ఫెయిల్ అయ్యింది. కథ చాలా సాదా సీదాగా, నీరసంగా మొదలవుతుంది. ఇదంతా తుఫాను ముందుండే ప్రశాంతత ఏమో… నగేష్ కుకునూర్ ఏదైనా అద్భుతాలు సృష్టిస్తాడేమో అని ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. కానీ.. శుభం కార్డు పడేంత వరకూ అలాంటివేం జరగవు.
పాత్రల ప్రవర్తన, వాటిని తీర్చిదిద్దిన విధానం.. ఇవన్నీ పాత చింతకాయ పచ్చడి ఫార్ములాలా అనిపిస్తే అది ప్రేక్షకుల తప్పు కాదు. సఖి, రాజు పాత్రల్ని డిజైన్ చేసిన విధానం చూస్తుంటే కుకునూర్ ఏకాలంలో ఉన్నాడా అనిపిస్తుంది. రాజు పాత్ర అయితే మరీననూ. వీధి నాటకాలు.. దానిపై నడిపిన సీన్లు బోర్ కొట్టిస్తాయి. కల్నల్ ఓ పల్లెటూరిని ఎంచుకుని రావడం, అక్కడి వాళ్ల నుంచి ఛాంపియన్లని తయారు చేయాలనుకోవడం మరీ సినిమాటిక్‌గా ఉంది. ఆ పాత్రకంటూ బలమైన ఫ్లాష్ బ్యాక్, బ్యాక్ స్టోరీ లేవు. సఖి – రాజు పాత్రల మధ్య కెమిస్ట్రీ అనేది బొత్తిగా శూన్యం. కల్నల్ పాత్రని సఖి ఇష్టపడుతున్నట్టు చూపించడం, రాజు దూరం అవ్వడం ఇవి మరీ మెలోడ్రామాగా అనిపిస్తాయి. రాను రాను కథ బల పడాలి. పాత్రలు పరిపుష్టిగా తయారవ్వాలి. కానీ.. ఈ సినిమాలో మాత్రం రివర్స్. సినిమా నడుస్తున్న కొద్దీ పాత్రల ఔచిత్సాలు సైతం దెబ్బతింటాయి. తాడూ బొంగరం లేని విధంగా ఎటు కావాలంటే అటు నడిచిపోతుంటాయి.
ఇదో స్పోర్ట్స్ డ్రామా. ఇలాంటి కథల్లో ఓ అనామకురాలు, ఎలా ఛాంపియన్ అయ్యిందన్నదే ఇంట్రస్టింగ్ ఎలిమెంట్. అది కూడా సఖిలో కనిపించదు. సఖి గెలిచినప్పుడో, ఓడినప్పుడో ఆ గెలుపు – ఓటమి ప్రేక్షకులు ఫీలవ్వాలి. కానీ అలాంటివేం జరగవు. స్టేడియంలో… వేలాది ప్రేక్షకులు హర్షద్వానాలు కురిపిస్తున్నా.. థియేటర్లో ప్రేక్షకుడికి ఎలాంటి ఉద్వేగం రాదు. అలాంటప్పుడు స్పోర్ట్స్ డ్రామాలు ఎందుకు పండుతాయి..? నిజానికి హిట్టైన ఏ స్పోర్ట్స్ డ్రామా అయినా.. వాటి చుట్టూ బలమైన భావేద్వాగాలు కాంపౌండ్ వాల్ గా పేర్చడతాయి. ఈ సినిమాలో అదీ లేదు. ఓదశలో నిజంగా ఈ కథని కుకునూర్ ఎలా రాశాడు? దాన్ని జాతీయ ఉత్తమ నటి కీర్తి ఎందుకు ఒప్పుకుంది? అనిపిస్తుంది. కొన్ని చోట్ల `గురు` ఛాయలు కనిపిస్తాయి. ప్రీ క్లైమాక్స్ ముందే ఈ సినిమా పూర్తిగా చతికిలపడిపోతుంది. క్లైమాక్స్ వరకూ ప్రేక్షకుడు ఓపిగ్గాకూర్చోవడం కూడా కష్టమే.
నిజానికి ఈ పాత్రలో కీర్తి ప్రత్యేకంగా చేసిందేం లేదు. `సినిమా అంతా నేనే కనిపిస్తా. అది చాలు` అనుకుంటే తప్ప.. ఇలాంటి సినిమాలు ఒప్పుకోరు. కోచ్ పాత్రలో జగపతిబాబు హుందాగానే కనిపించినా, ఆ పాత్రకంటూ బలమైన బ్యాక్ స్టోరీ లేకపోవడం వల్ల.. జగపతిబాబు కూడా తేలిపోతాడు. ఆది పినిశెట్టిని సైతం సరిగా వాడుకోలేదు. తన పాత్ర మరీ రొటీన్ అనే పదానికి కేరాఫ్ అడ్రస్స్ గా మారిపోయింది. రాహుల్ రామకృష్ణన్ కి ఇది కొత్త తరహా పాత్రే. కానీ చివరి వరకూ… ఆ టెంపోని అలా కాపాడలేకపోయారు.
పుష్ప సినిమాలో ఒక్కో పాటనీ ఒక్కో రకంగా తీర్చిదిద్ది.. ఆల్బమ్ ని హిట్ చేసిన దేవి నుంచి..ఇలాంటి ఓ బిలో యావరేజ్ ఆల్బమ్ వస్తుందని ఎవరూ ఊహించరు. ఒక్కటంటే ఒక్క పాట కూడా గుర్తు ఉండదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో కూడా చేసిందేం లేదు. కెమెరా వర్క్ ఎంత బాగున్నా, స్క్రీన్ పై పాత చింతకాయ్ పచ్చడి టైపు సీన్లు చూస్తుంటే ఎవరికీకిక్ రాదు. సింక్ సౌండ్ ఈ సినిమా కోసం వాడారు. అది సహజత్వం కోసం చేసే పని. కానీ… కొన్ని చోట్ల ఆ సింక్ సౌండ్ ప్రయోగం దెబ్బ కొట్టినట్టు అనిపిస్తుంది. కుకునూర్ ఈ కథపై పూర్తి స్థాయి కసరత్తు చేయలేదన్నది నిజం. ప్రతిభావంతులైన నటీనటులు, బలమైన సాంకేతిక నిపుణుల్ని.. దర్శకుడు సరైన రీతిలో వాడుకోలేకపోయాడు.
గుడ్‌లక్ సఖీ సినిమా ఏ నిమిషంలో మొదలెట్టారో గానీ, అంతా బ్యాడ్ లక్కే. షూటింగ్ సవ్యంగా సాగలేదు. రిలీజ్ డేట్లు వాయిదా పడుతూ వెళ్లాయి. విడుదలకు ముందు కూడా చాలా సమస్యలు వచ్చాయి. అంతా బ్యాడ్ లక్కే. చివరికి ఫలితంలో కూడా దురదృష్టమే వెంటాడింది.
ఫినిషింగ్ టచ్: లక్కు మారలేదు సఖీ
తెలుగు360 రేటింగ్: 1.5/5