వేసవిలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న హైదరాబాద్ ప్రజలకు కాస్త ఊరట లభించింది. శనివారం ఉదయం నుంచి నగరంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రతి రోజూ వడగాడ్పులతో సతమతం అవుతోన్న నగర ప్రజలకు తాజాగా రిలీఫ్ దక్కింది.
అదే సమయంలో వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే, రాబోయే రెండు రోజులు గరిష్టంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఎండల నేపథ్యంలో మధ్యాహ్నం సమయంలో ప్రజలెవరూ బయటకు వెళ్ళవద్దని వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది. ముఖ్యంగా పిల్లలు, వృద్దులు, గర్భిణీలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈమేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు.