వినయ విధేయ రామ… ప్రీ రిలీజ్ ఫంక్షన్ వల్ల ఓ గుడ్ న్యూస్ మెగా అభిమానులకు చేరింది. చిరంజీవి తదుపరి సినిమా ఎవరితోనో తేలిపోయింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో చిరు సినిమా ఖాయమైంది. ఈ సంగతి వినయ విధేయ రామ వేదికపై చిరంజీవినే చెప్పారు. త్వరలో త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయబోతున్నట్టు ధృవీకరించారు. డివివి దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారన్న విషయాన్నీ కన్ఫామ్ చేశారు చిరు. నిజానికి ఈ కాంబినేషన్ సెట్ చేసింది ఎవరో కాదు.. స్వయానా రామ్ చరణ్. ”డివివి దానయ్య అంటే రామ్ చరణ్‌కి ప్రత్యేక మైన అభిమానం. ఆ ఇష్టంతోనే నాతో సినిమాని దానయ్యతో నాతో ఓ సినిమా చేయిస్తున్నాడు. ఓ మంచి నిర్మాతకు నాకు అందించాడు” అని ఈ వేదికపై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు చిరు.
‘సైరా’ తరవాత చిరంజీవి కొరటాల శివతో ఓ సినిమా చేయాల్సివుంది. అయితే.. ఆ సినిమా ఉందా, లేదా? లేదంటే… ఆ స్థానంలోనే త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కబోతోందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ కొరటాల తప్పుకుంటే గనుక… సైరా తరవాత త్రివిక్రమ్ సినిమానే పట్టాలెక్కుతుంది. లేదంటే.. కొరటాల శివ సినిమా పూర్తయ్యాక త్రివిక్రమ్ సినిమా మొదలవుతుంది.