వరుస పరాభవాల దృష్ట్యా.. సినిమాల్ని కొనే విషయంలో ఓటీటీ సంస్థలు ఆచి తూచి అడుగులేస్తున్నాయి. మరీ ముఖ్యంగా చిన్న సినిమాలకు ఆమడ దూరం ఉంటున్నాయి. అమేజాన్ లాంటి సంస్థలైతే.. కొన్నాళ్ల పాటు చిన్న సినిమాల్ని కొనొద్దని గట్టిగా తీర్మాణించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆనంద్ దేవరకొండ సినిమా `మిడిల్ క్లాస్ మెలోడీస్` ఇప్పుడు అమేజాన్‌లో విడుదల అవుతోంది. చిన్న సినిమాల్ని పే ఫర్ వ్యూ పద్ధతిన (ఎంతమంది చూస్తే అన్ని డబ్బులు) కొనుక్కునే అమేజాన్ ఈసినిమాకి మాత్రం మంచి రేటు ఇచ్చింది. రూ.4.5 కోట్లకు `మిడిల్ క్లాస్..`ని కొనేసింది. ఆనంద్ సినిమాకి ఇది మంచి రేటే. తన తొలి సినిమా `దొరసాని` ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా, ఆ ప్రభావం ఈ సినిమాపై పడలేదు.
పైగా ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. కేవలం 5 రోజుల్లోనే 10 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. చిన్న సినిమా ట్రైలర్‌కి ఈ స్థాయి వ్యూస్ రావడం శుభ సూచికమే. పైగా `గుంటూరు` పాట కూడా జనాల్లోకి వెళ్లగలిగింది. గుంటూరు ప్రాంత ప్రాముఖ్యతని ఈ ఒక్క పాటలో చూపించారు. ఓ రకంగా గుంటూరోళ్లకు ఈ పాట ప్రాంతీయ గీతంగా చలామణీ అయిపోతున్నట్టే. ఇలా ఎటు చూసినా మిడిల్ క్లాస్‌కి అన్నీ మంచి శకునాలే కనిపిస్తున్నాయి. మరి ఓటీటీ బరిలో.. ఈసినిమా ఎలా నిలబడుతుందో చూడాలి.