నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి తొలి అడుగు. గుజరాత్ ను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మలచిన ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా శిలాన్యాసం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వ 17 నెలల కృషి ఫలితం. సాటి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రత్యేక అతిథిగా హాజరవుతున్న ఆనంద క్షణం.
తెలంగాణలోనూ మూడు చోట్ల పేదలకు అరుదైన విధంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి విజయదశమి నాడే శంకుస్థాపన జరుగుతుంది. ఒకప్పుడు పేదలకు పక్కా ఇళ్లంటే అగ్గిపెట్టెల్లా ఉండేవి. ఆ పద్ధతికి కేసీఆర్ గుడ్ బై చెప్పారు. బహుశా దేశంలోనే తొలిసారిగా డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం తలపెట్టారు.
అమరావతి శంకుస్థాపనకు అనేక ప్రత్యేకతలున్నాయి. ఊరూరు నుంచీ మట్టి నీరు రాజధాని నిర్మాణం కోసం తరలివస్తోంది. తెలంగాణలోని అన్ని పుణ్యక్షేత్రాల నుంచీ మట్టి, నీరు అమరావతికి క్షేత్రానికి తరలింది. నిన్న మొన్నటి వరకూ బద్ధ శత్రువుల్లా మాటల తూటాలు పేల్చుకున్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సుహృద్భావం వాతావరణం ఏర్పడింది. రెండు రాష్ట్రాలూ ప్రగతి పథంలో పోటీ పడాలే తప్ప మరో విధంగా పోట్లాడుకోవాల్సిన అవసరం లేదు.
రెండు తెలుగు రాష్ట్రాలకూ అపారమైన సహజ వనరులున్నాయి. ప్రతిభగల మానవ వనరులున్నాయి. తెలంగాణకు సింగరేణి మణిహారం. కోస్తాంధ్రకు సముద్ర తీరం ఓ వరం. పరస్పర సహకారంతో, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు పోతే మనకు మనమే బలం. కొన్నేళ్ల తర్వాత దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన మొదటి రెండు రాష్ట్రాలూ మనవే కావాలి. వాటిలో నెంబర్ వన్ ఎవరైనా మనకు అభ్యంతరం లేదు. మనం మనం తెలుగు వాళ్లం. అందుకే, విజయ దశమి వేళ ఉభయ రాష్ట్రాలకూ విజయీభవ.