తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి జవసత్వాలు ఇచ్చే పని మొదలైనట్టుగా ఉంది. ఎందుకంటే, ఈ మధ్యనే టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ నేతలతో సమావేశమై ఇక్కడి నాయకుల పనితీరు మెచ్చుకున్నారు. ముఖ్యమంత్రిగా నిర్వర్తించాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి కాబట్టి తాను ఆంధ్రాకు వెళ్లాల్సి వచ్చిందనీ, తెలంగాణ నాయకులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఇక్కడే ఉండిపోవాలని ఉందని అన్నారు! తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన మూలాలున్నాయనీ, సరైన నాయకత్వం అందిస్తే టీడీపీ దూసుకుపోతుందని నాయకుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. మొత్తానికి, చంద్రబాబు నాయుడు పిలుపు టి. టీడీపీ నేతల్లో కొంత చురుకుదనాన్ని తెచ్చిందని ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. కానీ, ఈ చురుకుదనం వెనక వాస్తవం వేరే ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమౌతోంది.
తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఇదే మంచి తరుణం అంటూ పిలుపునిచ్చారు టీడీపీ నేత పెద్దిరెడ్డి. తెలంగాణలో కూడా టీడీపీ అధికారంలోకి వస్తే బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎన్నో రకాలుగా మేలు జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో తెరాస సర్కారుపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతోందని ఆయన చెప్పారు! తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పొందడానికి మరో పదిహేను రోజులు గడువు ఇచ్చారనీ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాసేవ చేయాలని సంకల్పం ఉన్న నాయకులు ఎవరైనా పార్టీలో చేరవచ్చని ఆహ్వానం పలికారు. టీడీపీలో చేరేందుకు ఇదే భలే మాంచి తరుణమని పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు. అయితే, టీటీడీపీ నాయకుల్లో ఇంత చురుకు రావడానికి కారణం చంద్రబాబు చురకలు కూడా ఉన్నాయన్నది వాస్తవం అనేవారూ లేకపోలేదు!
తెలుగుదేశం సభ్యత్వ నమోదు ప్రక్రియపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఆంధ్రాలో కాస్తో కూస్తో నయం.. కానీ, తెలంగాణలో ఇంతవరకూ 2 లక్షల మంది కూడా సభ్యులుగా చేరలేదు! అనే కంటే… తెలంగాణ టీడీపీ నేతలు చేర్చలేకపోయాన్న అసంతృప్తి చంద్రబాబుకు బాగా నాటుకుందని చెబుతున్నారు. దాంతో తెలంగాణ నేతలకు ఎక్కడిలేని ఉత్సాహం వచ్చేసిందని అంటున్నారు. అందుకే, ఇప్పుడీ ఓపెన్ ఆఫర్లు ఇస్తున్నారు. మరి, ఈ ప్రచారానికి ఆకర్షితులై, సభ్యత్వం తీసుకునేవారు ఎంతమంది ఉంటారో కొద్దిరోజుల్లో లెక్కలు చెప్పేస్తాయి. తెలంగాణలో ఇంకా బలమైన పునాదులు తమకు ఉన్నాయని చంద్రబాబు చెబుతున్నారు కదా. మరి, ఆ పునాదుల బలమెంతో నిరూపించాల్సిన బాధ్యత తెలంగాణ నాయకుల భుజాలపై ఉందని చెప్పాలి!