తెలుగు360.కామ్ రేటింగ్ : 3/5
రహస్యాన్ని ఛేదించే క్రమం ఎప్పుడూ…. బాగానే ఉంటుంది. ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నల్ని రేకెత్తిస్తే చాలు… ఆ అన్వేషణ ఫలించినట్టే. థ్రిల్లర్లు సక్సెస్ అయ్యేది ఇక్కడే. కథ, చెప్పే విధానం, చూపించే పద్ధతి.. ఇవి ఎలా ఉన్నా – ముడి వేసినప్పుడు, దాన్ని తీసినప్పుడు నేర్పు చూపిస్తే చాలు. మార్కులు కొట్టేయొచ్చు. ‘క్షణం’ అదే చేసింది. ఊహించని మలుపులతో ఉక్కిరిబిక్కిరి చేసింది. దాంతో అడవిశేష్కి ఓ మార్గం దొరికింది. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్లు చేస్తే జనం చూస్తారన్న భరోసా దొరికింది. దాంతో.. ‘గూఢచారి’ లాంటి కథని ఆలోచించగలిగాడు. మరి ‘క్షణం’లానే.. ‘గూఢచారి’ని జనం మెచ్చేలా తీర్చిదిద్దాడా? ఆ ప్రయాణంలో ఎదురైన ఆటుపోట్లేంటి?
కథ
త్రినేత్ర అనేది ఓ ఇంటిలిజెన్స్ ఏజెన్సి. దేశంలోపల, బయట ఉన్న తీవ్రవాదుల్ని ఏరేస్తుంటుంది. వాటికి సంబంధించిన సమస్త సమాచారం ఉగ్రవాదుల చేతికి చిక్కుతుంది. దాంతో త్రినేత్ర ఆపరేషన్ తాత్కాలికంగా పక్కన పెట్టేస్తారు. గోపి (అడవిశేష్) తండ్రి త్రినేత్ర ఏజెంట్. ఉగ్రవాదుల చేతిలో చనిపోతాడు. దాంతో ఎప్పటికైనా నాన్నలా సీక్రెట్ ఏజెంట్ కావాలని తపిస్తుంటాడు గోపీ. చివరికి ఆ స్థానం కూడా దక్కుతుంది. అయితే.. అనుకుండా.. తనపై తీవ్రవాది అనే ముద్ర పడుతుంది. ఏ సంస్థ కోసం అయితే పనిచేస్తున్నాడో, అదే సంస్థ.. తనని వెదుకుతుంటుంది. ఈ పోరాటంలో గెలిచిందెవరు? అసలు గోపిపై తీవ్రవాది అనే ముద్ర ఎందుకు పడింది? ఎలా? అనేది.. తెరపై చూడాలి.
విశ్లేషణ
హాలీవుడ్ సినిమాలు చూసేవాళ్లకి జేమ్స్ బాండ్ ఫార్మెట్ తెలియంది కాదు. జేమ్స్ బాండ్‌కి ఓ మిషన్ ఉంటుంది. దాన్ని పూర్తి చేసి, తన దేశాన్ని ఎలా కాపాడన్నదే బాండ్ ఫార్ములా కథలు. అయితే గూఢచారి దానికి కొంచెం దగ్గరగా, కొంచెం దూరంగా ఉంటుంది. గూఢచారి కావాలనుకున్న ఓ యువకుడు, ఉగ్రవాదుల ఉచ్చులో ఎలా చిక్కాడు? అందులోంచి ఎలా బయటకు వచ్చాడు? అనేదాని చుట్టూ తిరుగుతూ, దేశభక్తి ని కాస్త, సెంటిమెంట్‌ని కాస్త మేళవిస్తూ థ్రిల్లర్‌లా సాగింది. తొలి సగంలో `గూఢచారి` అవ్వడం ఎలా అనే విషయంపై ఫోకస్ పెట్టిన దర్శకుడు… ఆయా సన్నివేశాల్ని ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దడంలో సఫలీకృతమయ్యాడు. ఓ రకంగా ఇది తెలివైన ఎత్తుగడ. అడవిశేష్ లాంటి ఏ ఇమేజ్ లేని నటుడ్ని నేరుగా జేమ్స్ బాండ్ స్థాయి పాత్రలో చూపిస్తే.. జనం అంగీకరించడం కష్టం. అందుకే… గూఢచారి అవ్వడానికి చేసే ప్రయత్నాలతో కథ మొదలెట్టి, తాను గూఢచారి అయ్యేసరికి… ప్రేక్షకులు కూడా అంగీకరించేలా చేయగలిగాడు. మధ్యలో ప్రేమకథ చూస్తే.. దర్శకుడేమైనా కాస్త దారి తప్పుతున్నాడేమో అనిపిస్తుంది. అయితే ఆ ప్రేమకథని కూడా మిషన్‌లో భాగంగా వాడుకోవడం నచ్చుతుంది. విశ్రాంతికి ముందొచ్చే సన్నివేశాలు, వేసిన చిక్కుముడులు బాగున్నాయి. దాంతో ఓ మంచి థ్రిల్లర్ చూడబోతున్నామన్న సంతృప్తికి వచ్చేస్తాడు ప్రేక్షకుడు. ఇక సెకండాఫ్‌లో ప్రేక్షకుల్ని థియేటర్లో కూర్చోబెట్టడమే మిగిలింది. అయితే.. ప్రధమార్థంలో కనిపించిన బిగి.. ద్వితీయార్థం మొదలయ్యేసరికి కాస్త సడలుతుంది. అటు పోలీసుల నుంచీ, ఇటు త్రినేత్ర నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఇంకాస్త థ్రిల్లింగ్ గా చూపిస్తే బాగుండేది. జగపతిబాబు పాత్రని ప్రమోషన్లలో ఎక్కడా వాడకుండా జగ్రత్తపడ్డారు. అది కాస్త సర్ప్రైజింగ్ ఎలిమెంట్‌గా మారింది. పతాక సన్నివేశాల్లో ట్విస్టుకి ఆ పాత్ర ఉపయోగపడింది. తొలి సగంలో కొన్ని చిక్కుముడుల్ని వేసిన దర్శకుడు వాటిని కొన్నే విప్పగలిగాడు. థియేటర్ నుంచి బయటకు వస్తున్న ప్రేక్షకుడు సంతృప్తిగానే ఉన్నా… ఇంకా అతని మదిలి తొలిచే కొన్ని ప్రశ్నలు అలానే ఉండిపోతాయి. దర్శకుడు ఎక్కువ స్వేచ్ఛ తీసుకోవడం వల్ల… కొన్ని చోట్ల లాజిక్కులు సైతం మిస్సయ్యాయి. బోర్న్ ఐడెంటిటీ, కింగ్స్‌మెన్, షూటర్ సినిమాల ఛాయలు అక్కడక్కడ కనిపిస్తుంటాయి. తొలి భాగంలో చాలా వరకూ కింగ్స్‌మెన్ ప్రభావం ఉంది.
నటీనటులు
అడవిశేష్ క్షణంతో ఆకట్టుకున్నాడు. మళ్లీ అలాంటి థ్రిల్లర్‌నే ఎంచుకోవడం వల్ల తన పని సులభం అయ్యింది. రానాలాంటి కథానాయకుడికైతే.. ఈ పాత్రలు టైలర్ మేడ్ లా సరిపోయేవి. శేష్ అక్కడక్కడ మరీ లవర్‌బోయ్‌లా కనిపించాడు. మొత్తానికి తనకు ఈ సినిమా ప్లస్సే అనుకోవాలి. జగపతిబాబు, సుప్రియ సర్ప్రైజ్ ఎలిమెంట్స్. ఇద్దరూ సీరియస్ లుక్స్‌లోనే కనిపించారు. ప్రకాష్‌రాజ్‌కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. మధుశాలిని చాలా కాలం తరవాత మళ్లీ కనిపించింది. శోభిత ఓకే అనిపించిందంతే.
సాంకేతిక వర్గం
స్క్రీన్ ప్లే ఈ చిత్రానికి ప్రధానబలం. రాసుకున్న మలుపులు.. కలిసొచ్చాయి. చాలా వరకూ.. గ్రిప్పింగ్‌గానే నడిచింది. ‘జేమ్స్ బాండ్ స్టైల్లో ఉంది’ అని కథానాయకుడు అంటే.. `కాస్త బడ్జెట్ తక్కువ` అని వెన్నెల కిషోర్ ఓ డైలాగ్ చెప్పాడు. ఈ సినిమాకీ అది వర్తిస్తుంది. తక్కువ బడ్జెట్లో జేమ్స్ బాండ్ సినిమాని తీద్దామనుకున్నారు. ఆ ప్రయత్నం సఫలీకృతమైంది. ఇదే కథని ఇంకా మంచి బడ్జెట్, స్టార్లు ఇచ్చుంటే తప్పకుండా మరోస్థాయిలో ఉండేది.
తీర్పు
జేమ్స్ బాండ్ తరహా కథలు మనమూ తీయొచ్చని అప్పుడెప్పుడో కృష్ణ నిరూపించారు. అయితే.. ఆ తరవాత ఎవ్వరూ ఈ జోనర్ జోలికి వెళ్లలేదు. హాలీవుడ్ సినిమాల్ని తెలుగులో డబ్ చేసుకుని సంతోషపడిపోయారు. అయితే… ఈ తరహా కథలు మళ్లీ ప్రయత్నించొచ్చు అని చెప్పిన సినిమా ‘గూఢచారి’. కొత్త తరహా కథలు కోరుకునేవాళ్లు, రొటీన్ సినిమాలకు దూరంగా ఓ మంచి యాక్షన్ థ్రిల్లర్ చూడాలనుకునేవారికి.. ‘గూఢచారి’ నచ్చుతాడు.
తెలుగు360.కామ్ రేటింగ్ : 3/5