పార్లమెంటు శీతాకాల సమావేశాలు వేడి వేడిగా జరగడానికి సర్వం సిద్ధమైంది. అసహనంపై తెగ అసహనంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఈ విషయంలో కమలనాథులను కడిగెయ్యడానికి సిద్ధమైంది. ఈ అంశంపై చర్చకు కేంద్రం ఒప్పుకొంది.
బుధవారం నిర్వహించి అఖిల పక్ష సమావేశంలో కేంద్రం ఒక్క మెట్టు కాదు, అనేక మెట్లు దిగింది. ఈసారైనా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ బిల్లును ఆమోదింప చేసుకోకపోతే సంస్కరణల రథం ఆగిపోతుందనేది మోడీ సర్కార్ భయం. అందుకే, దానికోసం అనేక విషయాల్లో రాజీపడింది. దేశంలో పెరుగుతున్న అసహనంపై చర్చచేపట్టాలని విపక్షాలు కోరాయి. దానికి కేంద్రం సై అంది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా రెండు రోజుల ప్రత్యేక ఉమ్మడి సమావేశాలు జరపాలనే ప్రతిపాదనకు కూడా ఓకే చెప్పింది. అంటే, గురువారం మొదలయ్యే పార్లమెంటు సమావేశాల మొదటి రెండు రోజులూ ఉభయ సభలూ సమావేశమై అంబేద్కర్ పై చర్చిస్తాయి. నివాళులు అర్పిస్తాయి. ఇదే కాదు, ప్రతిపక్షాలు కోరే ఏ అంశంమీదైనా చర్చకు సిద్ధమని కేంద్రం ప్రకటించింది.
పార్లమెంటుపై ప్రజలకు ఎన్నో ఆశలున్నాయని, వాటిని నెరవేర్చుదామని ప్రధాని మోడీ ప్రతిపక్షాలకు సూచించారు. జీఎస్ టి బిల్లును ఆమోదించడం తక్షణావసరమని నొక్కి చెప్పారు. ఈ బిల్లును రాజ్యసభలో ఆమోదించడానికి సహకరించాలని కోరారు. అయితే విపక్షం నుంచి స్పష్టమైన హామీ వచ్చినట్టు లేదు. అయితే తృణమూల్ కాంగ్రెస్, ఇతర పార్టీలు దీనికి సుముఖంగా ఉన్నాయి. గత సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటును స్తంభింపచేసింది. ఈసారి అలాంటి నిరసన కార్యక్రమం లేకపోతే, కాంగ్రెసేతర ప్రతిపక్షాల మద్దతుతో ఈ బిల్లుకు ఆమోదం పొందాలని కేంద్రం భావిస్తోంది. లేదా, పార్లమెంటు ఉమ్మడి సమావేశాల్లో అయినా ఆమోదం పొందాలని యోచిస్తున్నట్టు సమాచారం. అలా జరిగితే ఎన్డీయేకు ఉన్న సంఖ్యాబలం సరిపోతుంది. బిల్లు ఆమోదం పొందుతుంది. ఈసారి మోడీ ఫోకస్ అంతా ఈ బిల్లు మీదే ఉంది. ఇది కాకుండా ఇంకా అనేక అంశాలు కూడా సభ ముందుకు రాబోతున్నాయి. వీటిపై విపక్షాల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.