విశాఖను డేటా హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఎంవోయూలతో కాలక్షేపం చేయకుండా.., నేరుగా ఒప్పందాలు చేసుకుని రంగంలోకి దిగిపోతోంది. ఇటీవల గూగుల్ తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలో గూగుల్ అడ్వాంటేజ్ ను ఆసరాగా చేసుకుని మరిన్ని దిగ్గజ సంస్థల్ని ఆకర్షించి హైటెక్ సిటీ తరహాలో డేటా సిటీ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
విశాఖలో ఐదు వందల ఎకరాల స్థలంలో డేటా సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందులోఎనభై ఎకరాలు గూగుల్ కు కేటాయిస్తారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో వంటి సంస్థలకూ స్థలాలు ఇస్తారు. విశాఖకు వచ్చే కంపెనీలకు డేటా సిటీలోనే స్థలాలు కేటాయించనున్నారు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు, అద్భుతమైన వాతావరణం ఉన్న విశాఖ.. పారిశ్రామికవేత్తలకు మేలైన ఎంపికకు ప్లస్ పాయింట్లుగా ప్రభుత్వం ప్రమోట్ చేయనుంది.
ప్రపంచంలో డేటాతో పాటు పెరుగుతున్న ఏఐ రంగంలో స్టార్టప్‌లను ఎప్పటికప్పుడు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్రం నుంచి ఓ యూనికార్న్ రావాలని.. నారా లోకేష్ కూడా గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇందు కోసం యువ టెక్ నిపుణుల్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. అలాగే టాప్ 500 కంపెనీలను టార్గెట్ గా తీసుకుని.. ఆయన పెట్టుబడుల కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. డేటా సిటీని వీలైనంత త్వరగా ఏర్పాటు చేసి ఆయా కంపెనీల స్థలాలు కేటాయిస్తే.. విశాఖ సాఫ్ట్ వేర్ రంగంలో నిటారుగా నిలబడటానికి. ఓ ఆసరా లభించినట్లవుతుంది.