ఎవరితడు? గుర్తు పట్టారా? ఎవరో కాలేజీ పోరగాడా? కాదు, బాగా తెలిసిన ముఖం అనిపిస్తోందా? అవును. ఆన్ లైన్ ప్రపంచంలో హిమాలయాలంత ఎత్తుకు ఎదిగిన గూగుల్ కంపెనీకి సి.ఇ.ఒ. పేరు సుందర్ పిచాయ్. మన భారతీయుడే. తలచుకుంటే అద్భుతమైన స్టేడియాన్ని సొంతానికి కట్టించుకోదగిన ఆదాయం ఉన్నవాడు. రాళ్లను వికెట్లుగా చేసుకుని క్రికెట్ ఆడుతున్నాడేమిటి?
ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న సుందర్, ఢిల్లీలోని ఇండియా గేట్ మీదుగా వెళ్తుండగా కొందరు కుర్రాళ్లు క్రికెట్ ఆడటం చూశారు. సరదాగా తానూ ఆడాలని అనుకున్నారు. కారును ఆపారు. ఆ కుర్రాళ్లతో జాయిన్ అయ్యారు. గూగుల్ సి ఇ ఒ తమతో ఆడతానంటే కాదంటారా? అలా అతడికి బ్యాటింగ్ అవకాశం ఇచ్చారు. సరదాగా కాసేపు తన బ్యాటింగ్ ప్రతిభను ప్రదర్శించారు సుందర్.
చిన్నప్పుడు తాను గవాస్కర్ అభిమానని, తర్వాత సచిన్ ఆటతీరు నచ్చందని ఆయన చెప్పారు. అయితే తనకు ఫుట్ బాల్ అంటే చాలా ఇష్టమని, మెస్సీ అంటే ఎంతో అభిమానమని ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులకు ఇంటరాక్షన్ సందర్భంగా చెప్పారు.
యువత కలలను నిజం చేసుకోవాలంటే ఏకాగ్రతతో ప్రయత్నించాలని ఆయన డి యు విద్యార్థులతో సంభాషణ సందర్భంగా చెప్పారు. కొత్తగా ఆలోచిస్తేనే ఉన్నత స్థాయికి ఎదగడం సాధ్యమన్నారు. క్రియేటివిటీ ఉన్నవారికి ఆకాశమే హద్దు అని చెప్పారు. ఇన్నోవేటివ్ థింకింగ్ అనేది గొప్ప కెరీర్ కు ముఖ్యమని తెలిపారు. గూగుల్ సంస్థలో తన ప్రవేశం, అందులో ప్రస్థానం గురించి వివరించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చారు. నేటి యువతకు స్ఫూర్తినివ్వడానికి ప్రయత్నించారు.
భారత దేశం అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. భారతీయ యువతలోని సృజనాత్మక శక్తిని వెలికితీయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం ప్రస్ఫుటంగా కనిపించింది. హైదరాబాదులో మరో క్యాంపస్ ప్రారంభం సహా అనేక విషయాల గురించి సుందర్ వివరించారు. విద్యార్థులకు ప్రేరణగా నిలిచారు.