ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఐఏఎస్ అధికారుల్ని జాతీయ ఉపాధి హామీ పథకం బకాయిలు కోర్టుల చుట్టూ తిరిగేలా చేస్తున్నాయి. విచారణ జరిగిన ప్రతీ సారి ఉన్నతాధికారులు కోర్టుకు హాజరు కావాల్సి వస్తోదంి. ఈ రోజు జరిగిన విచారణకు పంచాయతీరాజ్ శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు గోపాలకృష్ణ ద్వివేదీ, హరీష్ రావత్ హైకోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెండింగ్ బిల్లులకు సంబంధించి ఇప్పటికే రూ.400 కోట్లు చెల్లించామని, మరో రూ.1100 కోట్లు వారం రోజుల్లో చెల్లిస్తామని హైకోర్టుకు తెలిపారు.
అయితే ఈ రూ. నాలుగు వందల కోట్ల చెల్లింపులు పంచాయతీల ఖాతాల్లో జమ చేశామని.. కాంట్రాక్టర్లకు చెల్లించలేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు చెప్పారు. నగదు నేరుగా కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోందని వారు ధర్మాసనం దృష్టికితీసుకెళ్లారు. కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించి ఆ వివరాలు తమకు చెప్పాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. తమకు హాజరు నుంచి మినహాయింపు కావాలని అధికారులు కోరారు. అయితే హైకోర్టు మాత్రం విచారణ పూర్తయ్యే వరకు ఉన్నతాధికారులు కోర్టుకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ రోజు విచారణలోనూ ఏపీ, కేంద్రం వేర్వేరుగా వాదించాయి.
కేంద్రం నుంచి నిధులు రావాలని ఏపీ లాయర్లు .. కేంద్రం ఇచ్చేసిందని కేంద్రం తరపు లాయర్లు వాదించారు. ఎవరెవరు ఎంతెంత చెల్లించారన్న అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఉపాధి పనుల బిల్లులపై నిన్న జరిగిన విచారణలో పిటిషన్లు దాఖలు చేసిన ఐదు వందల మందికి రెండు వారాల్లో డబ్బులు చెల్లించాలని జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశాలిచ్చారు.