అధికారుల్ని బదిలీ చేయడానికి ఆయనెవరు..? ముఖ్యమంత్రిని నేనా ..? రమేష్ కుమారా..? అన్న జగన్మోహన్ రెడ్డి డైలాగ్.. ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోనే ఉంటుంది. కరోనా లాక్ డౌన్ సమయంలో ఎన్నికలు వాయిదా వేసినప్పుడు… ఎప్పుడూ తెలుగు మీడియా ముందుకు రాని జగన్ ఆవేశపడిపోయి ప్రెస్‌మీట్ పెట్టారు. ఆ ప్రెస్‌మీట్‌లోనే ఆ మాట అన్నారు. దీనికి కారణం అప్పట్లో గుంటూరు, చిత్తూరు కలెక్టర్లతో పాటు తొమ్మిది మంది అధికారుల్ని బదిలీ చేయాలని ఆదేశించడమే. బదిలీలు చేయాల్సి వస్తే తానే చేయాలి కానీ నిమ్మగడ్డ ఎవరనేది జగన్ లాజిక్. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా.. దీనికి ఆన్సర్ లభిస్తోంది.
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎన్నికలకు సహకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే.. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజా శంకర్‌పై సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ బదిలీ వేటు వేశారు. దీనికి కారణం ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు కాదు.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఆదేశాలు. వీరిద్దరూ తమ విధుల్ని నిర్వర్తించలేదని.. ఓటర్ల జాబితాను ప్రకటించమని చెప్పినా ప్రకటించలేదని నిమ్మగడ్డ అసంతృప్తిగా ఉన్నారు. అందుకే వీరిని బదిలీ చేయాలని ఆదేశించారు. సీఎస్ పాటించారు. ఇప్పటికే… చిత్తూరు, గుంటూరు కలెక్టర్లతో పాటు మొత్తంగా తొమ్మిది మంది అధికారుల్ని విధులకు దూరం పెట్టారు. అధికారికంగా వారిని బదిలీ చేయనున్నారు.
ఎన్నికలకు సహకరించని వారి జాబితాలో చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్ కూడా ఉన్నారు. మరి వీరిని కూడా ఎస్ఈసీ బదిలీ చేస్తారో లేదో క్లారిటీ లేదు. వచ్చే రెండు మూడు రోజుల్లో ఎన్నికల నిర్వహణ వ్యవస్థను నిమ్మగడ్డ ప్రక్షాళన చేసి.. కొత్త అధికారులకు బాధ్యతలిచ్చే అవకాశం ఉంది. ఈ ఈ బదిలీలన్నీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకుండానే సాగుతాయి. అందుకే… ముఖ్యమంత్రి జగనే కానీ.. ఆ బదిలీలతో సంబంధం లేదు అనే సెటైర్లు సోషల్ మీడియాలో ప్రారంభమయ్యాయి.