తన సినిమాలోని కథలు, క్యారెక్టరైజేషన్లు మారుతున్నా.. తన గెటప్ మాత్రం ఏమాత్రం మార్చుకోవడానికి ఇష్టపడని కథానాయకుడు గోపీచంద్. అందుకే గోపీచంద్ లుక్ ప్రతీ సినిమాలోనూ దాదాపుగా ఒకేలా కనిపిస్తుంది. గోపీచంద్ స్టిల్స్ అన్నీ సోలోగా రిలీజ్ చేసి ఏ స్టిల్ ఏ సినిమాలోనిదో చెప్పుకోమంటే చాలా చాలా కష్టం. అలాంటి గోపీచంద్ ఇప్పుడు గెటప్ మార్చి షాక్ ఇచ్చాడు. గెడ్డం పెంచి స్టైలీష్ గా కనిపిస్తున్నాడు. గోపీచంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హన్సిక, కేథరిన్ కథానాయికలు. జె. భగవాన్, జె.పుల్లారావు నిర్మాతలు. ఈ చిత్రానికి గౌతమ్ నందా అనే టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. ఈ పోస్టర్లో గోపీ లుక్ చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. చాలా స్టైలీష్ కనిపిస్తున్నాడు ఈ లుక్‌లో. సినిమా కూడా అంతే స్టైలీష్‌గా ఉంటుందని, గోపీచంద్ కెరీర్లో బెస్ట్ మూవీ అవుతుందని చిత్రబృందం చెబుతోంది.
ఈనెలాఖరు వరకూ గౌతమ్ నందా షూటింగ్ హైదరాబాద్‌లో జరగబోతోంది. మార్చిలో పాటల్ని విడుదల చేస్తారు. ఏప్రిల్‌లో సినిమానీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. బెంగాల్ టైగర్ తరవాత సంపత్ నంది నుంచి వస్తున్న సినిమా ఇదే. ఆ హిట్‌ని ఈ సినిమాతో ఎంత వరకూ కాపాడుకొంటాడో చూడాలి. మరోవైపు పవన్ కల్యాణ్ సెంటిమెంట్‌ని ఈ సినిమాతోనూ కొనసాగించాడు సంపత్. తను పవన్‌కి వీరాభిమాని. పవన్‌తో ఓ సినిమా చేద్దామనుకొన్నాడు కుదర్లేదు. పవన్ కోసం అట్టిపెట్టుకొన్న బెంగాల్ టైగర్ అనే టైటిల్ తోనే రవితేజతో సినిమా తీశాడు. అత్తారింటికి దారేదిలో పవన్ క్యారెక్టర్ పేరు.. గౌతమ్ నందా. దాన్ని ఇప్పుడు టైటిల్ గా మార్చుకొన్నాడు. ఈ సెంటిమెంట్ ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.