ఒకప్పుడు తమిళ దర్శకులంటే… తెలుగు హీరోలకు మా మంచి నమ్మకం ఉండేది. కొంతకాలం వాళ్లే రాజ్యం ఏలారు. తమిళ తంబీలకు ఎర్ర తివాచీ వేసి మరీ ఆహ్వానించారు. తెల్ల బొట్టుని నుదుటన పెట్టుకున్న అసిస్టెంట్ డైరెక్టర్లకు కూడా అవకాశాలు ఇచ్చేసినట్టు మన సినిమాల్లోనూ – హీరోల వైఖరిపై సెటైర్లు వేసుకున్నారు. అయితే రాను రాను… ఆ మూస ఆలోచనా ధోరణి నుంచి తెలుగు హీరోలు పక్కకు జరిగారు. పైగా.. తమిళ దర్శకులు తీసిన సినిమాలన్నీ ఇక్కడ పల్టీకొట్టడంతో – వాళ్ల హవా బాగా తగ్గింది. దానికి తోడు.. తెలుగులోనూ హేమా హేమీలైన దర్శకులు తయారయ్యారు.
అయితే గోపీచంద్ మాత్రం తమిళ దర్శకుల్ని నమ్ముకుని భంగపడ్డాడు. మొన్న ఆక్సిజన్, ఇప్పుడు చాణిక్య రెండూ తమిళ దర్శకులు తీసిన చిత్రాలే. జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఆక్సిజన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సినిమాలో భారీదనం ఉన్నా – కంటెంట్ లేకపోవడంతో గోపీచంద్‌కు పరాజయం తప్పలేదు. తెలుగు ప్రేక్షకుల సెన్సిబుటిటీస్ అర్థం చేసుకోలేక జ్యోతికృష్ణ తప్పటడుగులు వేశాడు. అయితే తప్పు నుంచి గోపీచంద్ పాఠం నేర్చుకోలేదు. చాణక్యతో మరోసారి తమిళ దర్శకుడికి ఛాన్సిచ్చాడు. తిరు ఈ చిత్రానికి దర్శకుడు. తను యూనివర్సల్ కథని ఎంచుకున్నా – స్క్రీన్ ప్లే విషయంలో కొత్తదనం చూపించలేక భంగపడ్డాడు. దాంతో గోపీచంద్ ఖాతాలో మరో ఫ్లాపు పడిపోయింది. ఇలా బ్యాక్ టూ బ్యాక్ ఇద్దరు తమిళ దర్శకులకు అవకాశాలిచ్చి, పరాజయాల్ని కొని తెచ్చుకున్న హీరో – గోపీచందే. ఇక మీదట తమిళ దర్శకుడు కథ పట్టుకుని వస్తే గనుక.. మన హీరోలు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారేమో. అదే గోపీచంద్ అయితే.. – కలలో కూడా అలాంటి కథల్ని ఒప్పుకునే సాహసం చేయడేమో..?!