యాక్షన్ చిత్రాలకు సరిగ్గా సూటైపోతాడు గోపీచంద్. ఆరడుగుల కటౌట్ కదా… మాస్‌ని మెప్పించడం చాలా ఈజీ కూడా. కానీ సరైన కథ పడాలంతే. గత కొన్నాళ్లుగా గోపీచంద్ విజయం కోసం పరితపించిపోతున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఫలించడం లేదు. `సిటీమార్`తో తన గత వైభవం తిరిగివస్తుందని నమ్ముతున్నాడు. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈవారంలోనే విడుదల అవుతోంది. ఈ సందర్భంగా గోపీచంద్ తో చిట్ చాట్.
సంపత్ నందితో మళ్లీ ఎలా కుదిరింది?
– మీమిద్దరం కలిసి ఇది వరకు `గౌతమ్ నందా` చేశాం. ఆ సినిమా చేస్తున్నప్పుడే `నీతో మరో సినిమా చేస్తా` అని మాట ఇచ్చారు. ఆ తరవాత ఓ కథతో వచ్చాడు. అది ఎడ్యుకేషనల్ బ్యాక్ డ్రాప్ తో సాగే సినిమా. నాకేందుకో పెద్దగా నచ్చలేదు. అదే విషయం చెప్పా. రెండు నెలల తరవాత.. ఈ కథతో వచ్చాడు. బాగా నచ్చింది. అందుకే ఓకే చెప్పేశా.
గౌతమ్ నందా సరిగా ఆడలేదు కదా?
– అవును. కాకపోతే ఆ సినిమా సంపత్ బాగా తీశాడు. ఆ సినిమా ఆడకపోవడానికి చాలా కారణాలున్నాయి. మేం కూడా కొన్ని తప్పులు చేశాం. ఆ తప్పులు పునరావృతం చేయకుండా ఉంటే… మంచి సినిమా చేయొచ్చు అనుకున్నాం. ఈసారి ఆ తప్పులు చేయకుండా జాగ్రత్త పడ్డాం.
కబడ్డీ నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలొచ్చాయి. వాటితో `సిటీమార్` ఎలా విభిన్నమైనది?
– కబడ్డీ కబడ్డీ.. భీమిలి కబడ్డీ జట్టు సినిమాలు ఇది వరకు వచ్చాయి. ఒక్కడులో కబడ్డీ నేపథ్యం ఉన్నా.. కథ వేరే. ఆయా సినిమాలతో పోలిస్తే… మా సినిమా కొత్తగా ఉంటుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కమర్షియల్ హంగులు మిక్స్ చేయడం చాలా కష్టం. అది ఈ సినిమాతో కుదిరింది. ఇంత వరకూ నేను స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో ఒక్క సినిమా కూడా చేయలేదు. అందుకే నాకు మరీ కొత్తగా అనిపించింది.
బాలీవుడ్ లో విడుదలైన చెక్ దే ఇండియా స్ఫూర్తి ఉందా?
– చెక్ దే ఇండియా చాలా గొప్ప సినిమా. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాల్లో అదో మైల్ స్టోన్. ఆ సినిమాని స్ఫూర్తిగా తీసుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు కూడా.
కబడ్డీకి సంబంధించిన ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా?
– నేను కోచ్ కదా… ట్రైనింగ్ అవసరం లేదు (నవ్వుతూ). మా సినిమాలో నటించిన అమ్మాయిలు మాత్రం బాగా కష్టపడ్డారు.
ఈ సినిమాలో ప్రొఫెషనల్ కబడ్డీ ఆటగాళ్లని తీసుకొచ్చారట. నిజమేనా?
– అవును. జాతీయ స్థాయిలో ఆడదిన నలుగురు ఆటగాళ్లని తీసుకొచ్చాం. షాట్ గ్యాప్‌లో వాళ్లతో చాలా విషయాలు డిస్కర్స్ చేశా. వాళ్ల ఎక్స్పీరియన్స్ ఏమిటి? ఈ స్థానానికి రావడానికి వాళ్లెంత కష్టపడ్డారు?
ఇలాంటివన్నీ తెలుసుకున్ఆ. వాళ్ల కష్టాలు చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది. పాపం అనిపించింది. షూటింగ్ సమయంలో వాళ్లకు మోకాళ్లన్నీ దెబ్బలే. అయినా డెడికేషన్ తో పనిచేశారు.
తెరపై కోచ్ గా తమన్నా మీకెంత పోటీ ఇచ్చింది?
– తన పాత్ర చాలా పోటాపోటీగా ఉంటుంది. బోల్డ్ గా కూడా ఉంటుంది. ఇది వరకు తనతో సినిమా చేయాలని అనుకున్నా. కానీ వర్కవుట్ అవ్వలేదు. ఈసారి కుదిరింది. ఆ పాత్రని సంపత్ నంది చాలా స్ట్రాంగ్ గా తీర్చిదిద్దాడు. తన తో సీన్లు చాలా బాగుంటాయి.
మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ఎంత వరకూ ప్లస్?
– ఆయనే మాకు సగం బలం. మణిశర్మతో 7 సినిమాలు చేస్తే ఆరు హిట్టు. ఆయన పేరు చెప్పగానే ఓ కాన్ఫిడెన్స్ వచ్చింది. పాటలు కూడా బాగా ఇచ్చారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
సినిమా విడుదలలో జాప్యం జరిగింది కదా? ఆ ప్రభావం ఏమైనా కనిపిస్తుందా?
– 2019 డిసెంబరులో ఈ సినిమా మొదలెట్టాం. 2020 సమ్మర్ విడుదల చేద్దాం అనుకున్నాం. సరిగ్గా లాక్ డైన్ వచ్చింది. ఆ తరవాత సెకండ్ వేవ్ మొదలైంది. అన్ని సినిమాలతో పాటుగా మా సినిమా కూడా ఆలస్యమైంది. అయితే… ఆ ప్రభావం ఈ సినిమాపై ఏమాత్రం ఉండదు.
ఓటీటీలో విడుదల చేయాలన్న ఒత్తిడి వచ్చిందా?
– ఏ సినిమా అయినా థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. ప్రతి ఒక్రరూ థియేటర్ కోసమే సినిమా చేస్తారు. ఓటీటీల్లో విడుదల చేసుకోవడం తప్పులేదు. ఇప్పుడు థియేటర్లో విడుదల చేసే అవకాశం ఉంది కదా…? ప్రేక్షకులు కూడా మెల్లమెల్లగా థియేటర్లకు వస్తున్నారు.
థియేటర్లు తెరచినా ఓటీటీని ఆశ్రయిస్తున్నారు. వాళ్ల సంగతేంటి?
– నేనొక్కడినే ఈ విషయంలో కామెంట్ చేయకూడదు. వాళ్ల స్థానంలో కూర్చుని ఆలోచించాలి. వాళ్ల పరిస్థితి ఏమిటో మనకు తెలీదు కదా..? ఎవరైనా సరే.. ఆరు నెలల్లో సినిమా పూర్తి చేసి రిలీజ్ చేసేద్దాం అనుకుంటారు. మనం నిద్రపోతున్నా.. వడ్డీలు నిద్రపోవు. పెరుగుతూనే ఉంటాయి. ఏ సినిమా అయినా థియేటర్లో చూస్తేనే కిక్. ఓ సీన్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో థియేటర్ లోనే తెలుస్తుంది.
ఓటీటీ ప్రభావం ఎంత వరకూ ఉంటుంది?
– ఓటీటీ మంచి ఫ్లాట్ ఫామ్. కాకపోతే థియేటర్లు పోవడం జరగదు. జీవితాంతం ఉంటాయి. ఓటీటీ మరో వేదిక అంతే. దాని వల్ల కూడా మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
ఆంధ్రాలో 50 శాతమే ఆక్యుపెన్సీ ఉంది కదా? దాని వల్ల వసూళ్లు తగ్గుతాయన్న భయం లేదా?
– కరెక్టే. కానీ ఓ సినిమాని ఎన్నిరోజులు ఆపుకుంటారు? బయటకు వెళ్లాలి కదా.
తేజ దర్శకత్వంలో ఓ సినిమా అనుకున్నారు కదా? అదెప్పుడు?
– అనుకున్నది నిజమే. కానీ మెటీరియలైజ్ అవ్వలేదు. ఉంటుందో ఉండదో ఇప్పుడే చెప్పలేను. శ్రీవాస్ తో ఓ సినిమా చేయబోతున్నా. మారుతితో పక్కా కమర్షియల్ పూర్తి కావొచ్చింది.