కమర్షియల్ మీటర్ బాగానే పట్టుకొన్న దర్శకుల్లో గోపీచంద్ మలినేని ఒకరు. ‘క్రాక్’తో ఆయన భారీ కమర్షియల్ హిట్ కొట్టారు. అదే కాంబినేషన్ లో మొదలవ్వాల్సిన ‘క్రాక్ 2’ అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఈ గ్యాప్‌లో బాలీవుడ్ లో ఓ సినిమా పూర్తి చేశారు గోపీచంద్ మలినేని. అదే ‘జాట్’. సన్నీ డియోల్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మించింది. ఇటీవలే టీజర్ కూడా వచ్చింది. ఈ టీజర్‌ని పూర్తిగా ఎలివేషన్లతో నింపేశాడు గోపీచంద్ మలినేని. సన్నీడియోల్ ని బాలీవుడ్ దర్శకులు కూడా ఇలా చూపించి ఉండరు. ఆ స్పీడు, ఎనర్జీ అంతలా ఉన్నాయి. బాలీవుడ్ కు ఇప్పుడు కావాల్సింది ఇదే. ‘సలార్’, ‘కేజీఎఫ్’ తరవాత ఎలివేషన్లపై మోజు పెంచుకొంది బాలీవుడ్. తమ హీరోల్ని చూపించాలంటే దక్షిణాది దర్శకులే కరెక్ట్ అని ఫీలౌతోంది. షారుఖ్ ‘జవాన్’ సినిమా అట్లీ చేతుల్లో పెట్టడానికి కారణం అదే. ఆ ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇచ్చింది. అప్పటి నుంచీ దక్షిణాది దర్శకులపై బాలీవుడ్ కు మంచి గురి కుదిరింది.
ఇప్పుడు గోపీచంద్ మలినేని కూడా ఎలివేషన్లకే పెద్ద పీట వేశాడు. మాస్, యాక్షన్ హంగులతో కమర్షియల్ సినిమాని, పూర్తిగా సౌత్ స్టైల్ లో తీసి పెట్టాడు. ఈ టీజర్ చూశాక.. ‘జాట్’పై, గోపీచంద్ పై నమ్మకాలు మరింత పెరిగాయి. ఈ సినిమా గనుక హిట్టయితే గోపీచంద్ ని బాలీవుడ్ అస్సలు వదిలిపెట్టదు. బాలీవుడ్ లో బడా స్టార్లు సైతం ‘జాట్’ రిజల్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్నీ కలిసి వస్తే.. ‘జాట్’ విడుదల అయిన వెంటనే గోపీచంద్ అక్కడే మరో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు టాలీవుడ్ హీరోలు కూడా గోపీచంద్ ని పిలుస్తున్నారు. ‘క్రాక్ 2’ ఎలాగోలా ఈసారి సెట్ చేసేయాలని రవితేజ పట్టుదలతో ఉన్నట్టు టాక్. నందమూరి బాలకృష్ణ కూడా గోపీచంద్ తో మరో సినిమా చేయాలని ఫిక్సయినట్టు తెలుస్తోంది. ‘క్రాక్ 2’ కాస్త లేటయినా బాలయ్యతో కాంబో దాదాపు ఫిక్సని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ రెండు చోట్లా.. గోపీచంద్ మలినేని బిజీ కాబోతున్నాడన్నమాట.