ఈ సంక్రాంతి హిట్ గా నిలిచింది క్రాక్. ఈ సినిమాతో రవితేజ ఫుల్ హ్యాపీ. ఎందుకంటే.. చాలా కాలానికి, సరైన సమయానికి ఓ హిట్టు పడింది. శ్రుతిహాసన్ ఇంకా హ్యాపీ. రేసులో లేని హీరోయిన్ ని మళ్లీ ఫామ్ లోకి తీసుకొచ్చింది. కొత్త అవకాశాలు ఇచ్చింది. నిర్మాత ఇంకా.. ఇంకా హ్యాపీ. ఎందుకంటే, రిలీజ్ రోజున టెన్షన్ పెట్టిన సినిమా, చివరికి లాభాలు తీసుకొచ్చింది. అయితే దర్శకుడే హ్యాపీగా లేడు. అవును… గోపీచంద్ మలినేనికి ఇంకా పారితోషికం పూర్తిగా ముట్టలేదు. మరో పాతిక ముఫ్ఫై లక్షలు రావాల్సివస్తే, నిర్మాత మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ విషయం ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో పంచాయితీ వరకూ వెళ్లింది.
ముందు చేసుకున్న ఎగ్రిమెంట్ల ప్రకారం.. తనకు రావల్సిన పారితోషికం రాలేదని దర్శకుడు వాపోతున్నాడు. నిర్మాత మాత్రం `అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే అయ్యింది. దానికీ దీనికీ లెక్క సరిపోయింది. ఆ మాటకొస్తే దర్శకుడే తిరిగి ఇవ్వాలి` అంటున్నాడట. ఇలాంటి వ్యవహారాలు ఇప్పట్లో తెవిలేవి కావు. ఇప్పుడు `క్రాక్` సినిమా బాలీవుడ్ కి వెళ్లబోతోంది. అయితే దర్శకుడి అంగీకారం లేనిదే కథని అమ్మడానికి వీల్లేదు.కథ అమ్మినా.. దర్శకుడికి వాటా ఇవ్వాల్సి ఉంటుంది. బాలీవుడ్ రీమేక్ డీల్ ముందర పెట్టుకుని నిర్మాత ఇలాంటి పేచీకి దిగాడంటే ఆశ్చర్యం వేస్తుంది. సినిమా హిట్టయితే… దర్శకులకు ఖరీదైన బహుమానాలు ఇచ్చే నిర్మాతల్ని చూశాం. అసలు పారితోషికాన్ని ఎగ్గొట్టేవాళ్లూ ఉంటారన్నమాట.