ఎన్టీఆర్ `టెంపర్` సినిమా గుర్తుండే ఉంటుంది. ఎన్టీఆర్ వరుస ఫ్లాపులకు… పూరి ఈ సినిమాతో బ్రేక్ వేశాడు. ఇందులో కొత్త ఎన్టీఆర్ ని చూసే అవకాశం అభిమానులకు దక్కింది. దానికి కారణం… దయా పాత్రలోని నెగిటీవ్ షేడ్స్. డబ్బు కోసం ఏమైనా చేసే పోలీసు.. ఓ ఘటనతో మారతాడు. ఆ తరవాత తన తప్పుల్ని సరిదిద్దుకుంటాడు. నిజమైన హీరోగా ఎదుగుతాడు. సరిగ్గా.. ఇలాంటి కాన్సెప్టుతోనే మారుతి – గోపీచంద్ `పక్కా కమర్షియల్` తెరకెక్కుతోందని టాక్. అయితే… `టెంపర్`లో హీరో పోలీస్ అయితే, `పక్కా కమర్షియల్`లో లాయర్. అంతే తేడా.
`పక్కా కమర్షియల్` పేరుకు తగ్గట్టే… హీరో పాత్ర, పూర్తి కమర్షియలైజ్డ్ గా ఉండబోతోంది. డబ్బుల కోసం ఎలాంటి కేసునైనా తిమ్మిని బమ్మిగా మార్చి గెలిపించేస్తుంటాడు హీరో. ఓ కేసులో కూడా ఇలానే డబ్బుల కోసం… విలన్ ని గెలిపిస్తాడట. అయితే… ఆ కేసులో బాధితుల కన్నీళ్లు చూసి చలించిపోయి.. మంచివాడిగా మారి, నిజం కోసం పోరాడడం మొదలెడతాడట. ఆ తరవాత ఏమైందన్నది అసలు కథ. `టెంపర్`తో దగ్గరి లక్షణాలు కనిపిస్తున్నా.. మారుతి టేకింగు, తన స్టైల్ వేరు. చిన్న పాయింట్ నైనా… వినోదపు పూత పోసి.. నడపించేస్తాడు. కోర్టు రూమ్ డ్రామా అంటే సీరియస్ గా సాగే వ్యవహారం. దాన్ని మారుతి తనదైన టచ్‌తో.. తీయబోతున్నాడట. క్లైమాక్స్ వరకూ.. ఫన్ ఉంటుందని, క్లైమాక్స్ కి ముందే కథలో సీరియస్ ఎమోషన్ ఎంటర్ అవుతుందని, తన పాత సినిమాల్లానే ఫ్యామిలీ ఎమోషన్స్ కీ ఈ సినిమాలో చోటిచ్చాడని తెలుస్తోంది. `ప్రతిరోజూ పండగే`లో నటించిన సత్యరాజ్, రావు రమేష్‌లు సైతం.. ఈ సినిమాలో కనిపించబోతున్నారు.