అగ్ర హీరోలంతా ఇప్పుడే రూటు మార్చారు. యేడాదికి ఇన్ని సినిమాలు ఇవ్వాల్సిందే అంటూ ఫిక్సయి… అందుకు తగ్గట్టు ప్రణాళికలు రచించుకొంటున్నారు. గోపీచంద్ కెరీర్లో మాత్రం ప్లానింగ్ లోపం కనిపిస్తోంది. 2016లో గోపీచంద్ నుంచి సినిమాలేం రాలేదు. వరుస ఫ్లాపులు కొట్టి, ఫామ్ కోల్పోయిన వెటరన్ దర్శకుడు బి.గోపాల్ తో సినిమా ఒప్పుకొని పెద్ద సాహసానికి ఒడిగట్టాడు గోపీచంద్. మరోవైపు అసలేమాత్రం అనుభవం లేని జ్యోతి కృష్ణతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలూ నత్తనడక నడుస్తున్నాయి. ఎట్టకేలకు బి.గోపాల్ సినిమా పూర్తయ్యింది. ఆపసోపాలు పడిన ‘ఆక్సిజన్’ కూడా విడుదల ముందుకు వస్తోంది. ఇప్పుడు ఈ రెండు సినిమాలూ 15 రోజుల వ్యవధిలో విడుదల కాబోతున్నాయట.
బి.గోపాల్ సినిమాకి ‘ఆరడుగుల బుల్లెట్’ అనే పేరు ఖాయం చేశారు. ఈ సినిమా మేలో వచ్చేస్తోంది. మరోవైపు అదే మేలో ‘ఆక్సిజన్’ని రిలీజ్‌కి సిద్ధం చేస్తున్నారు. జూన్‌లో దువ్వాడ జగన్నాథమ్ వస్తోంది. జులైలో మహేష్ బాబు సినిమా విడుదల కానుంది. అందుకే మే తప్ప మరో మార్గం లేదు గోపీచంద్‌కు. మరోవైపు ‘గౌతమ్ నంద’ కూడా విడుదలకు సిద్ధమైపోతోంది. నిజానికి ఆక్సిజన్, ఆరడుగుల బుల్లెట్ 2016లోనే రావాల్సింది. నిర్మాతలు చేతులెత్తేయడంతో వాయిదా పడుతూ వచ్చాయి. బి.గోపాల్ సినిమాపై పరిశ్రమలో ఎలాంటి అంచనాలూ లేవు. ఈ సినిమాకి బిజినెస్ జరగడం కూడా కష్టమే. ఈ సినిమా ఫలితం ‘ఆక్సిజన్’పై పడే అవకాశం ఉంది. అది కూడా అటూ ఇటూ అయితే.. ‘గౌతమ్ నంద’పై ఉన్న కాస్త క్రేజూతుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది.