ఈమధ్య వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు గోపీచంద్. `భీమా`తో కాస్త ఊపిరి పీల్చుకొన్నాడు. అయితే ‘విశ్వం’ మళ్లీ దెబ్బకొట్టింది. ‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణతో ఓ సినిమా ప్లాన్ చేసింది యూవీ క్రియేషన్స్. ఇందులో గోపీచంద్ హీరో. అయితే ఈ ప్రాజెక్ట్ అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఇప్పుడు గోపీచంద్ ముందుకు మరో కథ వెళ్లింది. సంకల్ప్ రెడ్డి ఆయనకు ఓ కథ వినిపించారు. ‘ఘాజీ’ చిత్రంతో ఆకట్టుకొన్న దర్శకుడు సంకల్ప్. ఆ తరవాత ‘అంతరిక్షం’ తీశారు. అది బెడసి కొట్టింది. ‘ఐబీ – 71’ సినిమా కూడా ఆశించిన మేర ఫలితాన్ని తీసుకురాలేకపోయింది. అయితే ఇప్పుడు ఓ కొత్త కాన్సెప్ట్ కథతో గోపీచంద్ ముందుకు వెళ్లారు. ఈ కథ గోపీచంద్ కు కూడా బాగా నచ్చింది. చిట్టూరి శ్రీనివాస్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ‘విశ్వం’ తరవాత గోపీచంద్ చేయబోయే సినిమా ఇదే. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది.
కథల ఎంపికలో గోపీచంద్ జాగ్రత్తగా ఉండాల్సిన తరుణమిది. భారీదనం, హెవీ యాక్షన్ లేకపోతే.. సినిమాలు చూడడం లేదు. ముఖ్యంగా వరల్డ్ బిల్డింగ్ పై మోజు పెరిగింది. దాన్ని సరిగా వాడుకొన్న సినిమాలే వర్కవుట్ అవుతున్నాయి. అవన్నీ… ఈ కథలో ఉండేట్టు చూసుకొన్నాడట సంకల్ప్‌రెడ్డి. తన కథలన్నీ వాస్తవ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకొంటాయి. ఈసారీ అదే దారిలో వెళ్లాడా, లేదంటే పూర్తి స్థాయి కమర్షియల్ కథని సిద్ధం చేస్తున్నాడా అనేది చూడాలి. సంకల్ప్ రెడ్డికి కూడా ఇదే చివరి అవకాశం. ఈ సినిమాతో.. తన జాతకం డిసైడ్ అయిపోతుంది. అందుకే సంకల్ప్ కూడా కథ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని టాక్. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడవుతాయి.