ఒక దర్శకుడికి జయాపజయాలు సర్వసాధారణం. అయితే ఒక పరాజయం తర్వాత దానిని మరిచిపోయే విజయాన్ని ఇస్తేనే లైమ్ లైట్ లో వుంటారు. లేదంటే లైట్ తీసుకునే పరిస్థితి వస్తుంది. దర్శకుడు శ్రీను వైట్ల కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే ఎదురుకుంటున్నారు. నిజానికి శ్రీనువైట్ల ఫ్లాఫ్ కొత్తకాదు. వెంకీ విజయం తర్వాత అందరివాడు లాంటి ఫ్లాప్ ఇచ్చారు. ఐతే వెంటనే ‘ఢీ’తో అలరించారు. తర్వాత దుబాయ్ శీను, రెడీ, కింగ్, నమో వేంకటేశా, దూకుడు, బాద్షా ఇలా డబుల్ హ్యాట్రిక్ విజయాలతో వైట్ల కెరీర్ పరుగుపెట్టింది.
ఐతే ‘ఆగడు’ పరాజయం ఒక్కసారిగా వైట్ల వేగాన్ని ఆపేసింది. ఈ పరాజయం తర్వాత మళ్ళీ కోలుకోలేయపోయారు వైట్ల. బ్రూస్లీ, మిస్టర్, అమర్ అక్బర్ అంథోని.. ఇలా హ్యాట్రిక్ ఫ్లాపులు చుట్టూముట్టాయి. అమర్ అక్బర్ తర్వాత ఆయన మళ్ళీ మెగా ఫోన్ పట్టుకోలేదు. వాస్తవం చెప్పాలంటే.. ఆయన కొరుకునే హీరోలు దొరకలేదు. ‘ఢీ’కి సీక్వెల్ అనుకున్నా అది పట్టాలెక్కలేదు. దాదాపు ఐదేళ్ళ విరామం తర్వాత ఇప్పుడు వైట్ల కొత్త సినిమా కబురు వచ్చింది. గోపీచంద్ హీరోగా సినిమా ప్రారంభమైయింది. ఈ సినిమా వైట్లకి చాలా కీలకం. ఫైనల్ ఛాన్స్ అనుకోవాలి. వైట్ల కూడా ఈ సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వస్తేనే రేసులో వుంటారు. సినిమాతో వైట్ల మళ్ళీ ఫామ్ లోకి రావాలనే కోరుకుందాం.