గోపీచంద్ – బి.గోపాల్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఎట్టకేలకు ఇప్పుడు క్లైమాక్స్ పూర్తి చేసి రిలీజ్ చేయాలని నిర్మాతలు రెడీ అయ్యారు. ఇందుకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైపోయింది. అయితే టైటిల్ విషయంలో చిత్రబృందం ఇంకా ఓ నిర్దారణకు రాలేకపోతోంది. దీపావళికి గోపీచంద్ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల చేయాలని భావించారు. కానీ.. టైటిల్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతుండడంతో ఫస్ట్ లుక్ బయటకు రాలేదు. ఈ సినిమాకి బలం అనే టైటిల్ పెడదామనుకొన్నారు. అయితే అది హృతిక్ రోషన్ డబ్బింగ్ సినిమాకి టైటిల్ గా మారిపోయింది. ఆ తరవాత ఆరడుగుల బుల్లెట్ ఫిక్స్ చేద్దామనుకొన్నారు. అది మరీ… డబ్బింగ్ సినిమా టైటిల్లా అనిపించేసరికి దాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు గౌతమ్ నందా అనే మరో పేరు పరిశీలనలో ఉంది. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ పేరు ఇదే. అయితే టైటిల్ సాఫ్ట్ గా ఉందని గోపీచంద్ `నో` చెబుతున్నాడని తెలుస్తోంది. `బలం` టైటిల్ పై గోపీచంద్ మనసు పడ్డాడని, అదే కావాలని అంటున్నాడని టాక్. `బలం` టైటిల్ తెలుగు నిర్మాత దగ్గరే ఉందట. హృతిక్ రోషన్ కాబిల్ సినిమాకి ఇదే టైటిల్ పెట్టినా.. తిరిగి లాక్కునే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకు గోపీచంద్ బృందం మార్గాన్ని అన్వేషిస్తోందట. ఈనెల 8తో ఈ సినిమా షూటింగ్ ముగియనుంది. అదే రోజున ప్రెస్ మీట్ పెట్టి, టైటిల్ని అధికారికంగా ప్రకటిస్తారని చెప్పుకొంటున్నారు. గోపీచంద్ తన బలమంతా ఉపయోగిస్తే తప్ప… బలం అనే టైటిల్ వెనక్కి రాదేమో.