తమిళ దర్శకులపై తెలుగు హీరోల ప్రేమ ఇంకా తగ్గిపోలేదు. వాళ్లు కథలు చెబుతానంటే, వినడానికీ, నచ్చితే చేయడానికి రెడీనే. రామ్.. తమిళ దర్శకుడు లింగుస్వామితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు గోపీచంద్ కూడా ఓ తమిళ దర్శకుడు చెప్పిన కథకు ఓకే చెప్పినట్టు టాక్. సింగం సిరీస్‌తో ఆకట్టుకున్న దర్శకుడు హరి. మాస్, యాక్షన్ కథలకు ఆయన పెట్టింది పేరు. ముఖ్యంగా పోలీస్ కథలు. సింగం, సింగం 2, సింగం 3… తమిళంలోనే కాదు.. తెలుగులోనూ మంచి వసూళ్లు అందుకున్నాయి. ఇప్పుడు హరి ఓ కథ తయారు చేశాడని, అది గోపీచంద్ కి అయితే బాగుంటుందని అనుకుంటున్నాడని, ఈ కథ విషయమై.. గోపీచంద్ తో సంప్రదింపులు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. గోపీచంద్ కూడా హరితో సినిమా చేయడానికి రెడీగానే ఉన్నాడని టాక్. ఇది కూడా పోలీస్స్టోరీనే అని తెలుస్తోంది. గోపీచంద్ నటించిన `పక్కా కమర్షియల్` త్వరలోనే విడుదల కానుంది. ఈలోగా… ఈ కథ సెట్టయిపోతే, గోపీచంద్ చేసే తదుపరి సినిమా ఇదే అవుతుంది.