రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఓ చిత్రం రావాల్సింది. అయితే బడ్జెట్ కారణాల దృష్ట్యా ఈ ప్రాజెక్ట్ కి ప్రస్తుతానికి బ్రేకులు పడ్డాయి. రవితేజపై మైత్రీ మూవీస్ అంత పెట్టుబడి పెట్టడానికి సుముఖంగా లేదు. హీరో మారితే ప్రాజెక్ట్ ఆన్ అయిపోతుంది. రవితేజ కాకుండా ఈ కథకు ఎవరు సూటవుతారా? అనే తర్జన భర్జనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. చివరికి ఓ మంచి ఆప్షన్ కూడా దొరికింది. అజిత్ రూపంలో. అందుకే అజిత్ తో చిత్రబృందం సంప్రదింపులు జరుపుతోంది. అజిత్ కి తమిళంలో మంచి మార్కెట్ ఉంది. తెలుగులోనూ తన సినిమాలు బాగానే గిట్టుబాటు అవుతాయి. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని రూపొందిస్తే ప్రొడ్యూసర్లూ సేఫ్ అవుతారు.
అజిత్ దగ్గర ఓ సమస్య ఉంది. తమిళ దర్శకులతోనే పనిచేస్తా అని పట్టుబట్టి కూర్చునేరకం. ఇది వరకు కూడా ఇలాంటి స్టేట్మెంటే ఇచ్చాడు. చాలా కాలంగా ఆయన తమిళ దర్శకులతోనే పనిచేస్తున్నాడు కూడా. అయితే గోపీచంద్ మలినేని చెప్పిన కథ.. అజిత్ కి బాగా నచ్చిందని తెలుస్తోంది. కథ నచ్చిందికాబట్టి, తన పట్టు వీడే ఛాన్సుంది. అజిత్ వస్తే.. ఈ ప్రాజెక్టుకు కొత్త హంగు, కలర్ వచ్చినట్టే. గోపీచంద్ మలినేని కూడా తన మార్కెట్ ని విస్తరించుకొన్నట్టవుతుంది.