ప్రేమకథలు చేయాల్సిన వయసులో ‘యజ్ఞం’, ‘రణం’ వంటి యాక్షన్ కథలు చేశారు హీరో గోపీచంద్. అంతకు ముందు ‘జయం’, ‘నిజం’ సినిమాల్లో ప్రతినాయకుడిగా క్రూరత్వం చూపించారు. విలన్గా, హీరోగా తొలినాళ్లలో చేసిన సినిమాలతో యాక్షన్ ఇమేజ్ వచ్చేయడంతో తరవాత కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్స్ చేశారు. ఇప్పటివరకూ ఆయన పూర్తిస్థాయి ప్రేమకథ చేయలేదు. త్వరలో చేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో కొత్త దర్శకుణ్ణీ పరిచయం చేయబోతున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా గురించి తాజా ఇంటర్వ్యూలో గోపీచంద్ మాట్లాడుతూ “నేను ఇప్పటివరకూ ప్రేమకథలో నటించలేదు. నా దగ్గరకు వచ్చిన కథల్లో నచ్చినవి చేసుకుంటూ వచ్చా. ఇప్పుడు నేను ప్రేమకథలో నటించాలంటే… ఆ కథ నాకు తగ్గట్టుగా వుండాలి. కుమార్ అని ఓ కొత్త దర్శకుడు ఒక మంచి ప్రేమకథతో నా దగ్గరకు వచ్చాడు. అందులో నటించడానికి ఒప్పుకొన్నా. పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రమిది” అన్నారు. ఇప్పుడు గోపీచంద్ వయసు దగ్గరదగ్గరగా 40 ఏళ్ళు. ఈ వయసులో ఆయనో ప్రేమకథలో నటించాలంటే ఆయనకు తగ్గట్టు వుండాలి. ఈ వయసులో ఆయనో ప్రేమకథ చేయడం అంటే ప్రయోగమే. నటుడిగా గోపీచంద్ 25వ సినిమా ‘పంతం’ గురువారం విడుదల అవుతోంది. దీని తరవాత ప్రేమకథ చేస్తారా? మధ్యలో సంపత్ నంది సినిమా చేస్తారా? అనేది చూడాలి. ఎందుకంటే… సంపత్ నందికి, ఆయనకు మధ్య చర్చలు జరుగుతున్నాయని టాక్.