‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాల రూపంలో డబుల్ డిజాస్టర్లు పడ్డాయి పూరి జగన్నాథ్ పై. ‘డబుల్ ఇస్మార్ట్’ తరవాత పూరి సినిమా ఏమిటన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అయిన ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. కథపై కసరత్తులు చేస్తున్నారని, ఇంకా ఏదీ ఫైనల్ కాలేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం పూరి మైండ్ `గోలీమార్ 2`పై పని చేస్తోందన్నది ఇన్ సైడ్ సోర్స్ చెబుతున్నమాట. పూరి జగన్నాథ్ – గోపీచంద్ కాంబోలో వచ్చిన ‘గోలీమార్’ యావరేజ్ మార్కులు తెచ్చుకొంది. అయితే ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. దాని చుట్టూ మరో కథ నడపొచ్చని పూరి భావిస్తున్నాడు. దానిపై వర్క్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయి. ఆయన కొంతకాలంగా చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్నారు. 2025లో మూడు సినిమాలు తీయాలన్నది ప్లాన్. అందులో ‘గోలీమార్ 2’ ఒకటని సమాచారం.
మరోవైపు గోపీచంద్ ‘ఘాజీ’ దర్శకుడు సంకల్ప్‌రెడ్డి కథకు ఓకే చెప్పారు. ‘విశ్వం’ తరవాత గోపీచంద్ చేయబోయే సినిమా ఇదే. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా అయ్యాకే ‘గోలీమార్ 2’ ఉండొచ్చు. ఈలోగా పూరి మరో సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయి. పూరికి ఫ్లాపులున్నా హీరోలు అందుబాటులోనే ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు, ఎలాంటి స్టఫ్ పూరి నుంచి వస్తుందో ఎవరూ ఊహించలేరు. అందుకే హీరోల విషయంలో పూరికి ఢోకా లేదు.