ఈమధ్య మీడియం రేంజు హీరోల సినిమాలకు కష్టాలు ఎదురవుతున్నాయి. ఓటీటీ, శాటిలైట్ హక్కులు పడిపోవడంతో మార్కెట్‌పై విపరీతమైన ప్రభావం పడుతోంది. ఎంత మినిమం బడ్జెట్లో తీసినా, సినిమా ఆర్థికంగా గట్టెక్కడం కష్టంగా మారింది. వరుస పరాజయాలతో ఉన్న గోపీచంద్ పరిస్థితి మరింత అగమ్య గోచరంగా తయారైంది. ఈమధ్య వచ్చిన ‘భీమా’ కాస్త బెటర్ అవుట్ పుట్ ఇచ్చిందంతే. తాజాగా…శ్రీనువైట్లతో తీస్తున్న `విశ్వం` కూడా ఆర్థికపరమైన చిక్కుల్లో ఉంది. ఈ సినిమా ఇప్పటికే నిర్మాతల చేతుల్లోంచి వెళ్లిపోయింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని టేకొవర్ చేసింది. అయితే.. ఇప్పటికే ఓవర్ బడ్జెట్ అవ్వడం, గోపీచంద్ సినిమాల మార్కెట్ డ్రాప్ అవ్వడం, ఓటీటీ, శాటిలైట్ హక్కుల గిరాకీ పడిపోవడం వల్ల ‘విశ్వం’ ఇబ్బందుల్లో పడినట్టు ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
హరీష్ పెద్ది చేతుల్లో ఉన్నప్పుడు ఈ సినిమా బడ్జెట్ వేరు. ఆయన అనుకొన్న బడ్జెట్ చేజారిపోతుండడంతో.. ఈ సినిమా మెల్లగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చేతుల్లోకి వెళ్లింది. పీపుల్ మీడియా కూడా ఎంతంటే అంత ఖర్చు పెట్టే స్థితిలో లేదు. హీరో మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టుగా పొదుపుగా సినిమా తీయాల్సిందే. అయితే పీపుల్ మీడియా చేతుల్లోకి వచ్చినా.. బడ్జెట్ కంట్రోల్ లో లేదని తెలుస్తోంది. గోపీచంద్ గత సినిమాల మార్కెట్ కంటే 50 శాతం ఎక్కువ బిజినెస్ అయితే తప్ప `విశ్వం` ప్రాఫిట్ జోన్లోకి వెళ్లదు. అలా జరగాలంటే రాబోయే టీజర్, ట్రైలర్, ప్రమోషన్ కంటెంట్ ఓ రేంజ్లో ఉండాలి. శ్రీనువైట్ల గత సినిమాలు అనుకొన్న ఫలితాల్ని తీసుకురాలేకపోయాయి. దాంతో ‘విశ్వం’ టార్గెట్ రీచ్ అవుతుందా, లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.