లక్ష్యం, లౌక్యం తరవాత… గోపీచంద్ – శ్రీవాస్ మరోసారి జట్టుకట్టబోతున్నారు. వీరిద్దరి హ్యాట్రిక్ సినిమా ఖాయమైంది. గోపీచంద్ నటించే 30వ సినిమాకి శ్రీవాస్ దర్శకుడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించనుంది. త్వరలోనే.. సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం గోపీచంద్ `పక్కా కమర్షియల్` లో నటిస్తున్నారు. అది పూర్తయిన వెంటనే ఈసినిమా ఉంటుంది.
గత కొంత కాలంగా బాలకృష్ణ కోసం ఓ కథ తయారు చేసుకుని, ఆయన్ని ఒప్పించే పనిలో తిరుగుతున్నాడు శ్రీవాస్. ఓ కథని బాలయ్యకు వినిపించడం, బాలయ్య `ఓకే` అనడం జరిగాయి. దానినీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీనే నిర్మించాలి. అయితే బాలకృష్ణతో సినిమా అంటే.. ఇప్పటితో అయ్యే వ్యవహారం కాదు. తన చుట్టూ అరడజను నిర్మాతలున్నారు. వాళ్లందరికీ సినిమాలు చేసిస్తే గానీ.. ఈ సినిమా పట్టాలెక్కదు. అంత వరకూ శ్రీవాస్ ఆగడం కష్టం. అందుకే ఈ కథ చేతులు మారినట్టు తెలుస్తోంది. కాకపోతే… బాలయ్య – శ్రీవాస్ కాంబో మాత్రం ఖాయం. దానికి కొంత టైమ్ పడుతుంది. ఈలోగా.. గోపీచంద్ సినిమాని పూర్తి చేసి, హిట్ కొట్టినట్టైతే.. బాలయ్య నుంచి పిలుపురావడం పక్కా.