అందరిలాగే తాము కూడా చేస్తే వెరైటీ ఏం ఉంటుందని అనుకున్నారో లేదా… వెల్లువలా వస్తున్న వారికి అదే పనిగా కండువాలు వేస్తూ ఫోటోలు దిగడానికి అవతల బాస్‌కు ఖాళీ లేదో ఏమో గానీ.. మొత్తానికి కండువాలు పడకుండానే.. తమ మీద ఉన్న పార్టీ రంగు మార్చేస్తున్నారు తెలుగుదేశం ఎమ్మెల్యేలు. తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణ ఎమ్మెల్యేలు ఆరికపూడి గాంధీ, మాగంటి గోపీనాధ్ తెరాసలో చేరడానికి నిర్ణయించుకున్నట్లుగా ముహూర్తం కూడా పెట్టుకున్నట్లుగా కొన్ని రోజుల కిందటే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వారి తొందర గమనిస్తే.. ముహూర్తం దాకా కూడా ఆగే పరిస్థితి కనిపించడం లేదు. అర్జంటుగా తమ మీద ఉన్న తెదేపా ముద్రను కడిగేసి.. స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవాలని ఆరాటపడిపోతున్నట్లుంది. అందుకే తెరాసలో చేరి గులాబీ కండువాలు కప్పుకోక ముందే.. తమను తెరాస సభ్యులుగా గుర్తించాలంటూ.. ఆ ఇద్దరూ స్పీకరుకు లేఖ రాసుకున్నారు.
ఇద్దరు ఎమ్మెల్యేలు తమను కూడా తెరాస సభ్యులుగా గుర్తించాల్సిందిగా కోరుతూ రాసిన లేఖ తెలంగాణ అసెంబ్లీ స్పీకరు కార్యాలయానికి బుధవారం నాడు చేరింది. దీంతో.. తెదేపానుంచి తెరాసలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల మొత్తం సంఖ్య 12కు చేరినట్లయింది. ఆ పార్టీ తరఫున గెలిచినదే 15 మంది. అందులో 12 మంది జెండా మార్చేశారు.
అయితే మాగంటి గోపీనాధ్, ఆరికపూడి గాంధీ ఇద్దరూ కూడా తెదేపా అధినేతలతో ఉన్న సాన్నిహిత్యం, సామాజిక వర్గ సమీకరణాల రీత్యా.. అంత సులువుగా ఆ పార్టీని వీడి రాకపోవచ్చునని చాలా మంది అంచనా వేశారు. దానికి తగినట్లే.. మాగంటి గోపీనాధ్‌కు ఓటుకు నోటు నోటీసులు వచ్చాయనే వార్తలు వచ్చినప్పుడు, గాంధీపై ఫిరాయింపు పుకార్లు వచ్చినప్పుడు వారు స్పందించిన తీరు కూడా.. పార్టీ మారకపోవచ్చునని అనిపించింది. కానీ కొన్ని వారాల వ్యవధిలోనే వారు పార్టీ మారే నిర్ణయం తీసుకున్నారు. అధినేత వద్దకు వెళ్లి గులాబీ కండువాలు వేయించుకోవడానికంటె తొందర ఎక్కువ ఉన్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ముందు స్పీకరుకు లేఖ రాసేశారు.
వీరిపోకతో.. సభలో తెదేపా బలం ముగ్గురు సభ్యులకు పడిపోయింది. ఆర్.కృష్ణయ్య తనకు తెలుగుదేశంతో సంబంధం లేదని ఆల్రెడీ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. మరి సండ్ర వెంకట వీరయ్య సంగతేంటే కొన్నాళ్లు వేచిచూస్తే గానీ తెలియదు. రేవంత్‌రెడ్డి వన్ మ్యాన్ ఆర్మీగా మారినా ఆశ్చర్యం లేదని పలువురు అనుకుంటున్నారు.