ప్రస్తుతానికి ఆయన మాత్రం ‘నేను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలన్నీ అవాస్తవం’ అని అంటున్నారు. కానీ ఆయన పేరు మీద తొందర్లోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారనే పుకార్లు మాత్రం జోరుగానే రాజకీయ వర్గాల్లో షికారు చేస్తున్నాయి. ఆయన మరెవరో కాదు.. నరసరావు పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వచ్చి ఎమ్మెల్యే అయిపోయిన గోపిరెడ్డి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరుతారనేదే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా ఉంటున్నది.
గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కి ఇంకా ముహూర్తం కుదిరిందో లేదో తెలియదు గానీ.. మొత్తానికి ఆదివారం నాడు మీడియా ముందుకు వచ్చి.. తన పేరుకు ముడిపెట్టి వస్తున్న ఫిరాయింపు వార్తలను ఖండించారు. ఇవన్నీ అవాస్తవం అని ఆయన చెప్పారు. తన రాజకీయ ప్రస్థానం జగన్‌తోనే సాగుతుందని కూడా వెల్లడించారు.
అయితే ఫిరాయించదలచుకున్న ఏ నాయకుడు కూడా ఆ విషయం ఫైనలైజ్ అయ్యే వరకు ఇదే తరహాలో డొంకతిరుగుడుగా మాట్లాడుతూ ఉంటారనే సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న అనేక మంది వైకాపా ఎమ్మెల్యేలు తొలుత ఇదే మాదిరి చెప్పి, అనంతరం చేరుతున్న సమయంలో ‘నియోజకవర్గ అభివృద్ధికోసం’ అంటూ పడికట్టు పదాలను పేర్చి పలికిన వాళ్లే అనే సంగతి మనం గుర్తుంచుకోవాలి.
అయితే నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద ఫిరాయింపు పుకార్లు రావడానికి సరైన మూలం కూడా ఉంది. ఆయనకు వైకాపా లో జగన్ మీద రెబెల్ ఎమ్మెల్యేగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ నడుమ వలసలు మొదలైన తర్వాత.. జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో ఒక సమావేశం పెట్టుకుని నష్టనివారణ చర్యల గురించి చర్చించినప్పుడు.. ”ఎమ్మెల్యేలకు కాస్తంత విలువ ఇవ్వాలని, వారు చెప్పేది కూడా మీరు వినిపించుకోవాలని” అనడం ద్వారా జగన్ కు ఆగ్రహం తెప్పించిన ఎమ్మెల్యే ఈ గోపిరెడ్డే కావడం గమనార్హం. ఆ సమావేశంలో గోపిరెడ్డి ఇలామాట్లాడడంతో జగన్ ఆగ్రహించి, మధ్యలోనే మీటింగ్‌నుంచి వెళ్లిపోయినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. అప్పటినుంచి జగన్‌ను బహిరంగంగా ధిక్కరించిన ఎమ్మెల్యేగా గుర్తింపు ఉన్న ఆయన ఇప్పుడు తెదేపాలో చేరుతున్నారనే పుకార్లు వస్తోంటే.. నమ్మశక్యమే కదా!