వచ్చే లోక్ సభ ఎన్నికల్లో భాజపాకి తిరుగులేదు… ప్రధాని మోడీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షాల తిరుగులేని నమ్మకం ఇది..! మోడీ హవా దినదిన ప్రవర్థమానం అని ఊదరగొడుతూ వచ్చిన భాజపా అతి విశ్వాసానికి తగిలిన మరో ఎదురుదెబ్బ ఇది. వారు అంగీకరించలేకపోవచ్చుగానీ… దేశవ్యాప్తంగా మోడీకి మొదలైన ఎదురు గాలి తీవ్రత ఇది! ఉత్తరప్రదేశ్ లో రెండు లోక్ సభ స్థానాలకి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఇచ్చిన సంకేతాలు ఇవే. అయితే, ఆ రాష్ట్రంలో ఎస్పీ, బీఎస్పీ కలిసిపోయాయి కాబట్టే భాజపాకి ఓటమి ఎదురైందనీ, ఇది మోడీ ఎదురుగాలి కాదనే విశ్లేషణలు ఆ పార్టీ నేతలు తెరపైకి తెచ్చే అవకాశం ఉంది.
కానీ, 2014 ఎన్నికల్లో గోరఖ్ పూర్ లో ఎస్పీ, బీఎస్సీ, కాంగ్రెస్ పార్టీలకు పడిన ఓట్లన్నీ కలిపినా కూడా.. అంతకంటే ఎక్కువ, అంటే 5,39,127 ఓట్లు భాజపాకి వచ్చాయి. కానీ, తాజా ఉప ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలు మాత్రమే కలిశాయి. కాంగ్రెస్ కలవలేదు. కాబట్టి, ఇది భాజపాకి ఎదురుగాలి కాదని ఎలా చెప్పగలరు..? పైగా, 2019 లోక్ సభ ఎన్నికలకు వచ్చేసరికి ఎస్పీ, బీఎస్పీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ మహా కూటమి కడితే… అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో భాజపా లోక్ సభ స్థానాల సంఖ్య తగ్గే అవకాశం కచ్చితంగా ఉంటుంది.
కొద్దిరోజుల కిందట రాజస్థాన్ జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం వచ్చింది. అక్కడ కూడా భాజపా అధికారంలో ఉంది. అయినా సరే రెండు ఎంపీ స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. పంజాబ్ ఉప ఎన్నికల్లో కూడా ఓడిపోయారు. సరే, రాజస్థాన్ లో ఐదేళ్లుగా అధికారంలో వారే ఉన్నారు కాబట్టి… ప్రభుత్వ వ్యతిరేకత అనేది సహజంగానే కొంత వచ్చి ఉంటుందని చెప్పుకోవచ్చు. పంజాబ్ విషయానికొస్తే… అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉందీ, ఇటీవలే కదా అధికారంలోకి వచ్చారూ, కాబట్టి ఉప ఎన్నికల్లో వారే గెలిచారు అని వాదించొచ్చు. మరి, ఉత్తరప్రదేశ్ లో ఈ తాజా ఓటమిని ఎలా సమర్థించుకుంటారు..? యోగీ ఆదిత్యనాథ్ వైఫల్యం అని మాత్రమే సరిపెట్టుకుంటారా..? యూపీలో ఇటీవలే కదా భాజపా అధికారంలోకి వచ్చింది. ఈ ఫలితాలను కేవలం రాష్ట్ర స్థాయి పరిస్థితులకు ముడిపెట్టే విశ్లేషిస్తారా..? కానీ, వాస్తవం చాలా స్పష్టంగా కనిపిస్తోంది కదా. యూపీలోగానీ, రాజస్థాన్ లోగానీ, బీహార్ లోగానీ, చావు తప్పి కన్నులొట్టబోయిన గుజరాత్ లోగానీ మోడీ హవా రానూరానూ తగ్గుతోందనే సంకేతాలే వెలువడుతున్నాయి. దాన్ని అంగీకరించే పరిస్థితిలో మోడీ, అమిత్ షా ద్వయం లేకపోవచ్చు. త్రిపురలో గెలవలేదా, ఈశాన్య భారతంలో ఆదరణ పెరిగింది కదా అనే వాదన వినిపించే ఆస్కారమూ ఉంది. కానీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి అత్యంత కీలకమైన రాష్ట్రాల్లో మోడీకి ఎదురుగాలి వీస్తోందనేది వాస్తవం.